తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. అయితే జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని పెద్దమడూరు గ్రామంలో మాత్రం ఈ పండుగను ఏడో రోజే సద్దుల బతుకమ్మగా జరుపుకోవడం ప్రత్యేకతగా నిలుస్తోంది. గ్రామంలో తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం నేడు ఏడొద్దుల సద్దుల బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ సందడి నెలకొననుంది.
విషాద ఘటనతో మారిన సంప్రదాయం
పెద్దమడూరులో బతుకమ్మ పండుగను ఏడో రోజే సద్దుల బతుకమ్మగా జరుపుకోవడం వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. పూర్వం తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తున్న సమయంలో ఏడు జతల ఎడ్లు నీటిలో మునిగిపోయాయని, అదే సమయంలో మంటలు చెలరేగి నివాస గుడిసెలు కాలిపోయాయని గ్రామ పెద్దలు చెబుతుంటారు. ఈ ఘటనను అరిష్టంగా భావించిన గ్రామస్తులు, భవిష్యత్తులో ఎలాంటి కీడు జరగకూడదనే ఉద్దేశంతో తొమ్మిది రోజుల సంప్రదాయానికి బదులుగా ఏడో రోజే సద్దుల బతుకమ్మను నిర్వహించడం ప్రారంభించారని స్థానిక కథనం.
ఆడపడుచులకు రెండుసార్లు పండుగ
ఈ ఆచారంతో పెద్దమడూరు గ్రామంలోని కోడళ్లు, ఆడపడుచులకు ప్రత్యేక అవకాశం లభిస్తోంది. గ్రామంలో ఏడో రోజే సద్దుల బతుకమ్మ ఆడిన మహిళలు, అనంతరం తమ పుట్టింట్లోనూ, అత్తవారింట్లోనూ బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. దీంతో ఒకే పండుగను రెండుసార్లు జరుపుకునే ఆనందం వారికి కలుగుతోంది. అరుదైన ఈ సంప్రదాయం పెద్దమడూరు గ్రామానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది.

