జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్రలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
మన జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను, మన రాజ్యాంగ స్ఫూర్తిని చాటి చెప్పే గొప్ప కార్యక్రమమే ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్ర అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో దేవరుప్పుల మండలంలో రామరాజుపల్లి, కొడకండ్ల మండలంలో రామవరం, పాలకుర్తి మండలంలో చెన్నూరు గ్రామాల్లో ఏఐసీసీ, పిసిసి ఆదేశాల మేరకు డప్పు చప్పుళ్ళతో, గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలతో నిర్వహిస్తున్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనగా, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ రచ్చబండల వద్ద ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ…. దేశంలోని ప్రజలందరూ సమానమేనని, అందరికీ సమాన హక్కులు ఉండాలని రాజ్యాంగం చెబుతోందని ఆమె గుర్తు చేశారు. అలాగే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్ర అనేది కేవలం ఒక రాజకీయ కార్యక్రమం కాదని, ఇది మన దేశ మూలాలను, మన జాతి గర్వకారణమైన మహానుభావులను స్మరించుకునే ఒక పవిత్రమైన ప్రయాణంగా భావిస్తున్నాం అన్నారు. మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గం, డాక్టర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ఈ దేశానికి వెన్నెముకలాంటివి. వాటిని మనం ఎన్నటికీ మర్చిపోకూడదు అని అన్నారు. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా లాంటి కొందరు స్వార్థపరులు కేంద్ర మంత్రిగా ఉంటూ… రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తూ దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యాత్రలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, మన రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని భావితరాలకు చాటి చెప్పాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి యువతకు పిలుపునిచ్చారు.
ఈ యాత్ర ద్వారా మన దేశంలోని యువత రాజ్యాంగం యొక్క విశిష్టతను తెలుసుకుంటారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


