క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్ ఫోకస్|MALLU RAVI|CONGRESS|FOCUS
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికే మళ్లీ మద్దతు ఇవ్వాలని, ఆయనను గెలిపించాలని ప్రజలను కోరడం పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకటనపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల సందర్భంగా పరకాలలో మాట్లాడిన కొండా సుస్మిత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే అభ్యర్థిని ఎలా ఖరారు చేస్తారని ప్రశ్నించారు. గతంలో కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపిస్తూ, తమపై ఎదురుదాడికి దిగితే సీఎం, ఆయన కుటుంబ సభ్యుల స్కాములను బయటపెడతానని హెచ్చరించారు. పరకాల నియోజకవర్గంలో రాబోయే కాలంలో పోటీ చేసేది తానేనని, కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్రంగానైనా బరిలోకి దిగుతానని ఆమె స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి స్పందిస్తూ, క్షేత్రస్థాయి పరిస్థితులు మరియు ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకునే సీఎం రేవంత్ రెడ్డి తనను ప్రోత్సహిస్తూ మాట్లాడారని పేర్కొన్నారు. సుస్మిత చేసిన వ్యక్తిగత విమర్శలకు స్పందించి తన స్థాయిని తగ్గించుకోనని, తగిన సమయంలో పార్టీ అధిష్ఠానమే అన్ని విషయాలను చూసుకుంటుందని తేల్చిచెప్పారు. మంత్రి కొండా సురేఖతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సుస్మిత వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేని వ్యక్తులు ముఖ్యమంత్రిపై నోరు పారేసుకోవడం సరికాదన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా మాట్లాడే వారి వ్యాఖ్యలను ఎవరూ పరిగణనలోకి తీసుకోరని విమర్శించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందిస్తూ, పార్టీ గౌరవానికి భంగం కలిగించేలా ఎవరైనా లక్ష్మణరేఖ దాటి మాట్లాడితే సహించేది లేదని, సుస్మిత వ్యాఖ్యలపై పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. అలాగే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షీ నటరాజన్ కూడా ఈ పరిణామాలపై దృష్టి సారించి, సమగ్ర నివేదికను పంపాలని నాయకత్వాన్ని ఆదేశించారు. స్థానిక నియోజకవర్గంలో ఆధిపత్యం, టికెట్ కేటాయింపుల చుట్టూ మొదలైన ఈ వివాదం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

