ఢిల్లీ సుల్తానులు పాలించిన ప్రాంతాలను ఇస్లాం భాషలో సల్తనత్ అంటారు. సల్తనత్ అనగా రాజ్యము అని అర్థం. రాజ్యాన్ని పాలించిన రాజులను సుల్తానులు అంటారు. కాబట్టి ఈ ఢిల్లీ సుల్తానులకు గల మరో పేరు ఢిల్లీ సల్తనత్.

భారతదేశానికి ముస్లింల ఆగమనం తర్వాత మహమ్మద్ బిన్ ఖాసిం, మహమ్మద్ ఘజిని, మహమ్మద్ ఘోరీ అనే మహమ్మదీయులు భారతదేశంపై దండెత్తి గొప్ప విజయాలను సాధించి ఇస్లాం మతాన్ని భారతదేశంలో అభివృద్ధి పరచడానికి అన్ని రకాలుగా సహాయం చేశారు.
మహమ్మద్ బిన్ ఖాసీం భారతదేశంపై దండెత్తి పాలనను కేవలం సింధు ప్రాంతం వరకు మాత్రమే కొనసాగి తర్వాత అంతమైంది. అతని తరువాత వచ్చిన మహమ్మద్ ఘజిని భారతదేశంపై దండెత్తి కేవలం సంపదను దోచుకుని దేవాలయాలను విధ్వంసం చేసి వెళ్లిపోయాడు. కానీ చివరిగా వచ్చిన మహమ్మద్ ఘోరీ మాత్రం భారతదేశంలో ఢిల్లీ సుల్తానుల పాలనకు బీజం వేయడం జరిగింది. ఇతను పూర్తిగా రాజ్య విస్తరణ మరియు పాలన మీద దృష్టి కేంద్రీకరించాడు.
అఖండ భారతదేశాన్ని ఏకం చేసి పాలించిన తొలి ముస్లిం రాజులు ఢిల్లీ సుల్తానులు. వీరు సుమారుగా మూడు శతాబ్దాలకు పైగా పాలించారు. ఈ ఐదు వంశాలను కలిపి ఢిల్లీ సుల్తానులుగా చెప్పవచ్చు.
1) బానిస వంశము (క్రీ.శ.1206-1290)
2) ఖిల్జీ వంశము (క్రీ.శ.1290-1320)- తక్కువ కాలం పాలించిన సుల్తానులు (30 సంవత్సరాలు)
3) తుగ్లక్ వంశము (క్రీ.శ.1320-1414)- ఎక్కువ కాలం పాలించిన సుల్తానులు (94 సంవత్సరాలు)
4) సయ్యద్ వంశము (క్రీ.శ.1414-1450)
5) లోఢీ వంశము (క్రీ.శ.1450-1526)
ఢిల్లీ నగర చరిత్ర
తొలిమధ్యయుగ కాలంలో ఉత్తర భారతదేశాన్ని పాలించిన రాజపుత్ర రాజ్యాలు మరియు ఇతర వంశాలు ప్రస్తుత ఢిల్లీను రాజధానిగా చేసుకుని పాలించారు. ప్రాచీనయుగం అంతంలో షోడశ మహాజనపదాలైన 16 రాజ్యాలలో ఒకటి కురు రాజ్యం. ఈ కురు రాజ్యానికి రెండు రాజధానులు ఉండేవి. ఒకటి ఇంద్రప్రస్థ. రెండవది హస్తినాపురం. ప్రస్తుత ఢిల్లీ ప్రాచీన పేరు ఇంద్రప్రస్థ. ఇది ప్రాచీన కురు రాజ్యానికి రాజధానిగా ఉండి ప్రాచీన కాలంలోనే అంతరించిపోయింది. ఎనిమిదవ శతాబ్దంలో తోమారా రాజపుత్ర వంశానికి చెందిన అనంగపాలుడు అనే రాజు ప్రాచీన ఇంద్రప్రస్థ స్థానంలో దిల్లీకపురం అనే కొత్త నగరాన్ని నిర్మించాడు. ముస్లింలు భారతదేశంపై దండెత్తిన తర్వాత ముస్లిం రాజులకు ఈ దిల్లీకపురం రాజధాని అయ్యింది. ఈ దిల్లీకపురం చుట్టూ ఢిల్లీ సుల్తానులు మరియు మొఘల్ రాజులు ఏడు నగరాలను నిర్మించి మహానగరంగా మార్చారు. ఈ ఏడు నగరాలలో ఐదింటిని ఢిల్లీ సుల్తానులు నిర్మించగా రెండింటిని మొఘల్ రాజులు నిర్మించారు. అందుకే ఢిల్లీని “7 సిటీస్” గా పిలుస్తారు. కనుక అనంగపాలుడిని ఢిల్లీ నగర నిర్మాతగా చెప్తారు.
ఢిల్లీ చుట్టూ ఉన్న 7 నగరాలు:
1) మెహ్రౌలి – మహమ్మద్ ఘోరీకి మొదటి బానిసైన కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు.
2) సిరి – ఈ నగరాన్ని ఖిల్జీ వంశానికి చెందిన అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించాడు.
3) తుగ్లకాబాద్ – ఈ నగరాన్ని తుగ్లక్ వంశానికి చెందిన జియాజుద్దీన్ తుగ్లక్ స్థాపించాడు.
4) జహాపనా – ఈ నగరాన్ని తుగ్లక్ వంశానికి చెందిన మహమ్మద్ స్థాపించాడు
5) ఫిరోజాబాద్ – ఈ నగరాన్ని తుగ్లక్ వంశానికి చెందిన ఫిరోజ్ షా తుగ్లక్ స్థాపించాడు.
6) దీన్ పన – ఈ నగరాన్ని మొగల్ వ వంశానికి చెందిన హుమాయున్ స్థాపించాడు
7) శాజహనాబాద్ – నగరాన్ని మొఘల్ వంశానికి చెందిన షాజహాన్ నిర్మించాడు.
ఢిల్లీ సుల్తానుల రాజకీయ చరిత్ర
13వ శతాబ్దం ప్రారంభం నుండి అనగా ఢిల్లీ సుల్తానులు భారతదేశానికి వచ్చిన తరువాత స్పష్టమైన చరిత్రను లిఖించడం ప్రారంభమైంది.
1) బానిస వంశం
వీరు క్రీ.శ.1206 నుండి 1290 వరకు సుమారు 84 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారు. ప్రారంభంలో ఈ వంశ సుల్తానులు బానిసలుగా తమ జీవితాన్ని ప్రారంభించడం వల్ల ఈ వంశానికి బానిస వంశమనే పేరు వచ్చింది.
కుతుబుద్దీన్ ఐబక్(1206-1210):
ఇతనిని బానిస వంశ స్థాపకుడిగా చెప్పవచ్చు. ఇతను టర్కిష్ ప్రాంతానికి చెందిన బానిస. మహమ్మద్ ఘోరీ వద్ద సేనాపతిగా పనిచేస్తూ భారతదేశంలో గవర్నర్ గా నియమించబడ్డాడు. ఘోరీ మరణించిన తరువాత స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించి ప్రస్తుత పాకిస్తాన్ లోని లాహోర్ నుంచి పరిపాలించాడు. ఇతను లక్ భక్ష్ (లక్షల దానాలు చేశాడని అర్థం) మరియు మాలిక్ అనే బిరుదులను తీసుకున్నాడు. కానీ తనను తాను ఏనాడూ సుల్తాన్ అని సంబోధించుకోలేదు. 1210 సంవత్సరంలో చౌగన్ అనే క్రీడను ఆడుతూ గుర్రం మీద నుండి కిందపడి ప్రమాదంలో మరణించాడు. ఇతని ఆస్థానంలో హసన్ నిజామీ అనే చరిత్రకారుడు ఉండేవాడు. ఇతను “తాజుల్ మాసిర్” అనే పర్షియన్ గ్రంథాన్ని రచించాడు.
ప్రాచీన కాలంలో సాహిత్యం మొత్తం దాదాపు సంస్కృత భాషలో రచించబడింది. కానీ ముస్లిం పాలకులు వచ్చిన తర్వాత భారతదేశానికి
పర్షియన్ భాష అధికార భాష కావడంతో ముస్లిం గ్రంథాలన్నీ పర్షియన్ భాషలోనే రాయబడ్డాయి.
ఆరం షా:
ఇతను కేవలం ఒక సంవత్సరం మాత్రమే పాలించాడు.
ఇల్ టుట్ మిష్ (1211-1236):
ఇతని అసలు పేరు అల్తమష్ ఇతను కుతుబుద్దీన్ ఐబక్ కు బానిసగా ఉంటూ అతని కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఢిల్లీ దగ్గర ఉన్న బధౌన్ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేశాడు. రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చాడు. 1229లో ముస్లిం మత పెద్ద అయిన ఖలీఫా నుండి మన్సూర్ అనే ఆమోద పత్రాన్ని పొందాడు. భారతదేశ చరిత్రలో కేవలం ముగ్గురు సుల్తానులు మాత్రమే ముస్లిం ప్రపంచానికి అధిపతి అయిన ఖలీఫా నుండి మన్సూర్ ఆమోదపత్రాన్ని పొందారు. వారు మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ మరియు ఇల్ టుట్ మిష్. ఇతను టంక అనే వెండి నాణెములను మరియు జితల్ అనే రాగి నాణెములను ప్రవేశపెట్టాడు. వీటి నిష్పత్తి 1:48. ఇతను పరిపాలనలో అనేక మార్పులను తీసుకువచ్చి నూతన పరిపాలన వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ఇక్తా వ్యవస్థ ఇందులో ముఖ్యమైనది. ఇందులో భాగంగా సైన్యాన్ని నిర్వహించే బాధ్యతలను ఉన్నతాధికారులకు అప్పగించాడు. వారి జీతభత్యాలను నగదు రూపంలో కాకుండా ఇక్తా రూపంలో చెల్లించేవాడు. ఇక్తా అనగా ఒక అధికారి తన జీతభత్యాలకు గాను మరియు అతను నిర్వహిస్తున్న సైనిక ఖర్చులకు గాను రాజ్యంలోని కొంత భూభాగాన్ని ఇవ్వడం. వీటిని నిర్వహించే అధికారిని ఇక్తేదారు అంటారు. ముస్లిం పురోహితులకు మరియు ముస్లిం మత సంస్థల నిర్వహణకు రాజ్యంలోని చాలా భూమిని దానంగా ఇచ్చేశాడు. ప్రస్తుతం ఈ భూములనే వక్ఫ్ భూములు అంటున్నారు. ఇతని కాలంలోనే 40 మంది టర్కిష్ ఇక్తేదారులు కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘాన్ని తుర్ఖాన్ -ఈ-చిహల్గని లేదా చాలీసా అని పిలిచేవారు. సుల్తాన్ ఈ సంఘం చేతిలో కేవలం నామమాత్రపు (డిజ్యూరో) సుల్తాన్ గా మారాడు. ఈ నలభై మందితో కూడిన చిహల్గని సంఘం వాస్తవ (డిఫాక్టో) అధికారాలను చలాయించారు. మంగోల్ నాయకుడైన చెంఘీజ్ ఖాన్ 1221లో భారతదేశానికి దండెత్తి రాగా తన తెలివితేటలు మరియు దౌత్య నీతి ద్వారా అతని దాడి నుండి భారతదేశాన్ని కాపాడాడు.
రజియా (1236-1240):
ఈమె ఇల్ టుట్ మిష్ కుమార్తె. భారతదేశాన్ని పాలించిన ఏకైక ముస్లిం మహిళగా రజియా పేరుగాంచింది. కానీ మహిళ పాలించడం ఇస్లామిక్ ధర్మశాస్త్రమైన షరియకు విరుద్ధము కావడంతో ముస్లిం పురోహిత వర్గమైన ఉలేమా రజియాను తీవ్రంగా వ్యతిరేకించారు. జమాలుద్దీన్ యాకూత్ అనే ఇథియోపియా దేశానికి చెందిన హబ్షి (ఆఫ్రికన్ నీగ్రో జాతి) అమీర్ -ఏ -అకూర్ కు (అశ్వదలాధిపతి) పదవిని ఇవ్వడం వల్ల ప్రభు వర్గం ఆగ్రహానికి గురయ్యారు. ఈ కాలంలో తురుష్క జాతి ఆధిపత్యం కొనసాగేది. వీరు రజియా మరియు ఆమె భర్త అయినా అల్తునియాను హత్య చేయడంతో ఈమె పాలన ముగిసింది. ఈమె తరువాత బహరం షా మరియు మసూద్ షా అనే ఇద్దరు బలహీన సుల్తానులు రాజ్యానికి వచ్చారు. వీరి తరువాత ఘియాజుద్దీన్ బాల్బన్ అనే బానిస రాజు రాజ్యానికి వచ్చాడు.
ఘియాజుద్దీన్ బాల్బన్ (1266-1286):
ఇతను ఇల్ టుట్ మిష్ బానిసగా ఉంటూ రజియా కాలంలో అమీర్ -ఈ -షికార్ (సుల్తాన్ యొక్క వేటకు ఏర్పాటు చేసే శాఖ) పనిచేసి తరువాత నాసిరుద్దీన్ మొహమ్మద్ కాలంలో ప్రధానమంత్రి గా పనిచేశాడు. ఆ తరువాత నాయబ్ – ఏ -సుల్తాన్ (డిప్యూటీ సుల్తాన్) గా మారాడు. ఇతనిని బానిస వంశంలోనే అత్యంత గొప్పవాడిగా చెప్తారు. ఇతను సుమారు 20 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతను రాజ్య విస్తరణకు అంతగా ఆసక్తి చూపకుండా కేవలం చక్రవర్తి అధికారాన్ని సుస్థిరం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. సుల్తాన్ గౌరవాన్ని పెంచడానికి రాచరిక వ్యవస్థను ప్రారంభించడానికి అనేక చర్యలు తీసుకున్నాడు. రాజే దైవాంశ సంభూతుడని, భగవంతుని నీడ అని మరియు భగవంతుని ప్రతినిధి అని బహిరంగంగా చెప్పాడు. ఇరాన్ కు చెందిన సిజ్ద, పైబోస, నౌరోజ్ అనే మూడు పర్షియన్ సాంప్రదాయాలను రాజ దర్బార్ లో ప్రవేశపెట్టాడు. సుల్తాన్ ఆధిపత్యానికి అడ్డుగా ఉన్న చిహల్గని అంతం చేసి బాల్బన్ అత్యంత గొప్ప విజయాన్ని సాధించాడు. ఇతను దిర్హం అనే బంగారు నాణాలను ప్రవేశపెట్టాడు. మంగోల్ దాడులను ఎదుర్కోవడానికి దౌత్య నీతి మరియు సైనిక శక్తిని ప్రయోగించాడు. కానీ తన కుమారుడు మహమ్మద్ ను కోల్పోయాడు.
కైకుబాద్ (1286-1290):
ఇతనిని బానిస వంశంలో చివరివాడిగా చెప్పవచ్చు. ఇతను బాల్బన్ కి మనవడు. ఇతను ఒక పక్షవాత రోగి ఇతని సేనాని జలాలుద్దీన్ ఖిల్జీ ఇతనిని అంతం చేసి ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు. దీనితో బానిస వంశపాలన అంతమై ఖిల్జీ వంశ పాలన ప్రారంభమైంది గా భావించవచ్చు.

