Friday, August 7, 2026
27.5 C
Hyderabad

శ్రద్ధేది? శుద్ధ దండగ!?|EDITORIAL

2025 వర్షాకాల సమావేశాల్లో నిర్ణయించిన సమయంలో లోక్‌సభ కేవలం 29%, రాజ్యసభ 34% మాత్రమే పనిచేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభలో కేవలం 23%, రాజ్యసభలో 6% మాత్రమే పని జరిగింది. అదే సమావేశాల్లో14 బిల్లులు ఆమోదం పొందాయి. వాటిలో అనేక బిల్లులు పరిమిత చర్చల మధ్యే ఆమోదం పొందాయి. మొత్తం 21 సమావేశ దినాలు ఉన్నప్పటికీ, మూడింట రెండు వంతుల సమయం పట్టు విడుపులు లేని పట్టుదలల రాజకీయ మైలేజీ వ్యూహ, ప్రతివ్యూహాల అంతరాయాలకే కోల్పోయింది.

పార్లమెంటులో చర్చ ప్రభుత్వ విధి, విధానాల నాణ్యతను మెరుగుపరిచే సాధనం. ప్రతిపక్షం లేవనెత్తే ప్రశ్నలు ప్రభుత్వానికి అసౌకర్యం కలిగించవచ్చు. కానీ అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి. విమర్శలను స్వీకరించి సమాధానాలు ఇవ్వడం వల్లనే పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

దేశ ప్రజాస్వామిక పరిపానకు పార్లమెంట్ గుండెకాయ. ప్రజల సమస్యలను చర్చించడం, ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టడం, చట్టాలను సమగ్రంగా పరిశీలించి ఆమోదించడం దాని ప్రధాన బాధ్యత. అయితే ఇటీవలి కాలంలో పార్లమెంట్ పనితీరును పరిశీలిస్తే, ఈ లక్ష్యాలు క్రమంగా బలహీనపడుతున్నాయనే ఆందోళన పెరుగుతోంది. అధికార, ప్రతిపక్షాలు రాజకీయ వ్యూహాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రజా సమస్యలపై సార్థక చర్చలు తగ్గిపోతున్నాయి. చట్టసభల ప్రతిష్ఠ దెబ్బతింటుండగా, పార్లమెంటరీ వ్యవస్థపై ప్రజల విశ్వాసం కూడా క్రమంగా క్షీణిస్తోంది.

పార్లమెంట్ సమావేశాలు చర్చలకు వేదికగా కాకుండా ఆరోపణలు, ప్రత్యారోపణలు, నినాదాలు, వాయిదాలకే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్షానికి రాజ్యాంగం అనేక అవకాశాలు కల్పించింది. ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్, స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్చలు, అత్యవసర అంశాలపై ప్రకటనలు వంటి అనేక పార్లమెంటరీ సాధనాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని పూర్తిస్థాయిలో వినియోగించకుండా నిరసనలకే పరిమితమవుతుండగా, మరోవైపు ప్రభుత్వం కూడా ప్రతిపక్షం లేవనెత్తే అంశాలపై విస్తృత చర్చకు ఆసక్తి చూపడం లేదు.

ఇటీవలి పార్లమెంట్ సమావేశాల పనితీరుపై స్వతంత్ర శాసన పరిశోధనా సంస్థ పీఆర్‌ఎస్ (పీఆర్ఎస్ లెజిస్టేటివ్ రీసెర్చ్) విడుదల చేసిన విశ్లేషణ ఆందోళన కలిగిస్తోంది. 2025 వర్షాకాల సమావేశాల్లో నిర్ణయించిన సమయంలో లోక్‌సభ కేవలం 29 శాతం, రాజ్యసభ 34 శాతం మాత్రమే పనిచేశాయి. మొత్తం 21 సమావేశ దినాలు ఉన్నప్పటికీ దాదాపు మూడింట రెండు వంతుల సమయం పట్టు విడుపులు లేని పట్టుదలల రాజకీయ మైలేజీ వ్యూహ, ప్రతివ్యూహాల అంతరాయాలకే కోల్పోయింది. ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభలో కేవలం 23 శాతం, రాజ్యసభలో 6 శాతం మాత్రమే పని జరిగింది. అదే సమావేశాల్లో 13 బిల్లులు ప్రవేశపెట్టగా, 14 బిల్లులు ఆమోదం పొందాయి. వాటిలో అనేక బిల్లులు పరిమిత చర్చల మధ్యే ఆమోదించబడ్డాయి.

పార్లమెంటులో చర్చ అనేది కేవలం రాజకీయ ప్రక్రియ కాదు. అది ప్రభుత్వ విధి, విధానాల నాణ్యతను మెరుగుపరిచే సాధనం. ప్రతిపక్షం లేవనెత్తే ప్రశ్నలు ప్రభుత్వానికి అసౌకర్యం కలిగించవచ్చు. కానీ అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి. విమర్శలను స్వీకరించి సమాధానాలు ఇవ్వడం వల్లనే పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. చర్చలు లేకుండా బిల్లులు ఆమోదించడం రాజ్యాంగం అనుమతించినప్పటికీ, అది ప్రజాస్వామ్య సంప్రదాయానికి అనుకూలం కాదు. ప్రజాభ్యుదయానికి ఉచితమూ కాదు.

ఈ పరిస్థితుల్లో లోక్‌సభ స్పీకర్ పాత్ర మరింత కీలకంగా మారుతుంది. సభలో అన్ని పక్షాలకు సమాన అవకాశాలు కల్పించడం, ఉద్రిక్తతలను తగ్గించడం, చర్చలకు అనుకూల వాతావరణం సృష్టించడం స్పీకర్ బాధ్యత. గతంలో నీలం సంజీవరెడ్డి, బలరామ్ జాఖడ్, పి.ఎ. సంగ్మా, శివరాజ్ పాటిల్ వంటి స్పీకర్లు సభా గౌరవాన్ని కాపాడుతూ అధికార, ప్రతిపక్షాల మధ్య సమతుల్యత పాటించారు. ప్రస్తుతం ప్రతిపక్ష సభ్యులకు తగినంత సమయం దక్కడం లేదనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. ఈ విమర్శలను స్పీకర్ కార్యాలయం గంభీరంగా పరిగణించాల్సిన అవసరం ఉంది.

ప్రధానమంత్రి సభలో తరచూ పాల్గొని కీలక అంశాలపై స్పందించడం కూడా ప్రజాస్వామ్య సంప్రదాయంలో భాగం. దేశానికి సంబంధించిన ముఖ్యమైన విధానాలపై సభలోనే వివరణ ఇవ్వడం ప్రజల విశ్వాసాన్ని పెంచుతుంది. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి, పీ.వీ. నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి ప్రధానులు ప్రతిపక్ష విమర్శలకు సభలోనే సమాధానాలు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం తన విధానాలను ప్రజలకు వివరించేందుకు పార్లమెంట్ కంటే ఇతర వేదికలను ఎక్కువగా ఉపయోగిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అయితే మొత్తం బాధ్యతను అధికార పక్షంపైనే మోపడం కూడా సముచితం కాదు. ప్రతిపక్షం కూడా ప్రతి అంశాన్ని సభా స్తంభనగా మార్చకుండా, పార్లమెంటరీ విధానాలను సమర్థంగా వినియోగించాలి. నిరసన ప్రజాస్వామ్య హక్కే అయినప్పటికీ, చర్చను పూర్తిగా అడ్డుకోవడం ప్రజల ప్రయోజనాలకు విరుద్ధం. పార్లమెంట్‌లో చర్చించాల్సిన అంశాలను రోడ్లపైకి తీసుకెళ్లడం చివరి ప్రత్యామ్నాయంగా ఉండాలి.
దేశం ప్రస్తుతం నిరుద్యోగం, ధరల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం, విద్య, ఆరోగ్యం, సరిహద్దు భద్రత, ఆర్థిక అసమానతలు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై విస్తృత చర్చలు జరగడం అత్యవసరం. ప్రజలు ఎంపీలను తమ సమస్యలకు పరిష్కారాలు సూచించడానికి ఎన్నుకుంటారన్నది మరువరాదు.

2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. అధికార కూటమి భాగస్వామ్య పక్షాల మద్దతుతో ప్రభుత్వం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మరింత సంప్రదింపుల పద్ధతిని అవలంబించడం, ప్రతిపక్షానికి తగిన అవకాశాలు కల్పించడం ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుంది. అదే సమయంలో ప్రతిపక్షం కూడా నిరంతర ఆందోళనలకన్నా అంశాల వారీగా ప్రభుత్వాన్ని నిలదీయడంపై దృష్టి పెట్టాలి.

పార్లమెంట్ ప్రజలది. ఏ ఒక్క పార్టీది కాదు. అధికార పక్షం పాలనను సమర్థించుకోవడానికి, ప్రతిపక్షం ప్రశ్నించడానికి, స్పీకర్ ఆరెండు పక్షాల మధ్య సమానతను కాపాడడానికి ఉద్దేశించిన రాజ్యాంగ వ్యవస్థ అది. చర్చలు బలహీనపడితే ప్రజాస్వామ్యమే బలహీనపడుతుంది. అందువల్ల అధికార పక్షం, ప్రతిపక్షం, స్పీకర్ ముగ్గురూ తమ రాజ్యాంగ బాధ్యతలను గుర్తించి పార్లమెంట్‌ను మళ్లీ ప్రజా సమస్యలకు కేంద్రబిందువుగా మార్చాలి. అదే భారత ప్రజలకు, పార్టీలకు ప్రజాస్వామ్యానికి నిజమైన బలం.

Latest News

ఇగిప్పుడు ‘సావు’కొచ్చింది!?|ADUGU TRENDS

మన ఊర్లల్ల ఎవ్వలన్న కాలం శేసిండ్రంటేనే సూసొత్తం. కనికరం సూపి తలో సెయ్యేత్తం. దిక్కూమొక్కూలేనోల్లతై మనమే తలా ఇంతేసుకుని గాయింత ఇగ గా కట్టెల్లేసొత్తం. కానీ, తలకొరివి పెట్టాల్సిన కన్న బిడ్డలే కడసారి...

ఆగస్టు 07, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి నవమి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి దశమి నక్షత్రం కృత్తిక సాయంత్రం 04.48 వరకు ఉపరి రోహిణీ యోగం వృద్ధి ఉదయం 11.17 వరకు ఉపరి ధ్రువ కరణం గరజి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి...

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

సంయమనం కోల్పోతే రాజకీయ సంక్షోభమే!?|EDITORIAL

వ్యక్తిగత విమర్శలు తాత్కాలిక రాజకీయ ప్రచారానికి ఉపయోగపడవచ్చు. కానీ, దీర్ఘకాలంలో నాయకుడి విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. రాజకీయ వారసత్వం కేవలం కుటుంబ నేపథ్యంతోనే రాదు, హుందాతనంతో కూడిన నాయకత్వంతోనే నిలుస్తుంది. మాటలతో సంపాదించేది ప్రచారం...

ఆగస్టు 06, గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి మధ్యాహ్నం 03.39 వరకు ఉపరి నవమి నక్షత్రం భరణి సాయంత్రం 06.11 వరకు ఉపరి కృత్తిక యోగం గండ మధ్యాహ్నం 02.03 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 03.39వరకు ఉపరి తైతుల రాహుకాలం...

తింటే గీ అవ్వ శేతి గారెలే తినాలె!?|ADUGU TRENDS

ఎన్కటికి... యింటే భారతమే యినాలె... తింటే గారెలే తినాలన్నరు. కనీ, ఇగిప్పుడైతే, తింటే గింటే గీ అవ్వ శేతి గారెలే తినాల్నని తిన్నోల్లంటాండ్రు. మరి, గా గారెల ముచ్చటేందో సూద్దాం పదండ్రి. ములుగు జిల్ల...

బీజేపీ-ఆత్మపరిశీలనకు సరైన సమయం! EDITORIAL

ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ఒక సందేశం! ప్రతి ఉప ఎన్నిక ఒక హెచ్చరిక!! ప్రతి ప్రజా ఉద్యమం పాలకుల పాలనకు అద్దం. ఇప్పటిదాకా అప్రతిహతంగా అధికారం చెలాయిస్తున్న బీజేపీ అనూహ్యంగా ఈ మూడింటినీ...

ఆగస్టు 05 బుధవారం 2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు , ఆషాఢ మాసము-కృష్ణపక్షం తిథి కృష్ణ-సప్తమి ఈ రోజు (05) రాత్రి 8:42 వరకు, తదుపరి కృష్ణ-అష్టమి నక్షత్రము అశ్విని ఈ రోజు (05) రాత్రి 9:18 వరకు,...

ఇగ పోను అన్ లాక్ శేసుడు అల్కన!!?|ADUGU TRENDS

ఇగో గిప్పుడు గా పోన్ల వాడుడు అందరికీ అల్కగైపోయింది. సంటి పోరగాండ్ల కానుంచి, పండు ముసలోల్ల దాకా పోను వాడుతనే ఉన్నరు. ఇగ గీ వాడుట్ల అప్పుడప్పుడు గా పోన్ల లాకుల నెంబర్ల...

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News