హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శాంతి చర్చల కమిటీ నేతలు కలుసుకున్నారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించేందుకు ముఖ్యమంత్రి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించేందుకు ప్రయత్నించాలని కోరారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్ లు సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
శాంతి చర్చల కమిటీ నేతలతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, నక్సలిజాన్ని తమ ప్రభుత్వం శాంతిభద్రతల సమస్యగా కాకుండా, ఒక సామాజిక సమస్యగా చూస్తుందని తెలిపారు. మావోయిస్టు సమస్య పరిష్కారానికి చర్చలు అత్యవసరమని అంగీకరించారు. గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం ఉన్న సీనియర్ నేత జానారెడ్డి సలహాలు, సూచనలు తీసుకోవాలని సీఎం తెలిపారు.
ఈ అంశంపై మంత్రులతో సమావేశమై సమగ్ర చర్చలు జరిపి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శాంతి చర్చలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని, మావోయిస్టు సమస్యను శాంతి మార్గంలో పరిష్కరించాలనే దిశగా ప్రభుత్వ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.

