వరంగల్ లో మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావులకు ఇప్పుడు షాడో భయం వెంటాడుతోంది. తాము నాటిన మొక్కే, ఏడాది తిరిగేసరికి మానై వేర్లు కొండా దంపతుల రాజకీయ పునాదులను పెకిలించే స్థాయికి పరిస్థితి మారిందని ఆయన అనుచరులు, హస్తం తమ్ముళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. గత ఏడాది ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితిని వీడి ‘కొండా’ పంచన చేరిన ‘షాడో’ వారి సామ్రాజ్యాన్నే గుప్పెట్లో పెట్టుకునే స్థాయికి చేరడం ‘కొండా’ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చేరదీసి, చేతినిచ్చి, చేయూతనిచ్చి, చేవనిచ్చి, ఇప్పుడు ఏమి చేయడం? అన్న మీమాంసలో కింకర్తవ్యం అర్థంగాక పాపం! కొండా దంపతులు సైతం బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని వారి అనుచరులు ఆవేదన చెందుతున్నారు. కొండ అండదండలతోనే ఇదంతా జరుగుతుందా? అన్న అనుమనాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎంతో రాజకీయ అనుభవం న్న కొండా దంపతులు పోయి పోయి గోరుతోపోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటారా? అన్న భరోసాని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. పెంచడమే కాదు, తగ్గించడం, తుంచడం కూడా వాళ్ళకు తెలుసని వారి అనుచరులు ధైర్యం చెప్పుకుంటున్నారు.
అయితే, కొండే నా అండాదండా అంటూ, అనేక పనులు చక్కబెడుతూ షాడోగా ఎదిగిన వ్యక్తి తన పుట్టినరోజు పేరుతో నూతన సంవత్సరం వేళ చేసిన హంగామా చూసిన, విన్న వారు ఇది ఇలాగే కొనసాగితే, మాకు అండ అనుకున్న కొండా పరిస్థితి ఏంటని ప్రశ్నించుకుంటున్నారు. అన్నను కలవాల్సిన పనిలేదు, ఈ చిన్న అన్న దగ్గరకి వెళ్తే చాలు, పనులవుతాయని ప్రచారం కావడం, పార్టీ క్యాడర్ కూడా అక్కడే కేంద్రీక్రుతం అవుతుండటం, పనులు, సమస్యలున్న ప్రజలు కూడా అటుగానే వెళుతుండటం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. అధికారం అంది వచ్చిన ఏడాదిలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటని కాంగ్రెస్ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. లేకలేక చాలా కాలం తర్వాత వచ్చిన అధికారం అనే అవకాశం చేజారి పోతోందా? అంటూ, ఎంతో ఆశపడ్డ సీనియర్లు, ఆశావాహులు ఆయోమయంలో పడ్డారు.
మొన్నటి దాకా బీఆర్ఎస్ తో లబ్ధి పొంది, ఇప్పుడు కాంగ్రెస్ పంచన, కొండా అంచున చేరిన సదరు వ్యక్తి రేపు మరోసారి వంచన చేయడన్న గ్యారెంటీ ఏంటని కొండా మురళి అనుచర వర్గం చర్చించుకుంటున్నారు. కొండ దంపతులకు నేరుగా ఈ విషయాలు చెప్పలేని వాళ్ళు ‘అడుగు’ ద్వారా మీరైనా అడగండని, ఆ అరాచకాలను కడగండని వేడుకుంటున్నారు. షాడో తో తాడోపేడో తేల్చుకుంటామని కొందరు కాంగ్రెస్ సీనియర్లు సిద్ధమవుతున్నారు. మరి రాజకీయాల్లోనే కాదు ఎత్తుగడల్లో, అండదండలు అందించడంలో అందెవేసిన ’చేయి‘ తిరిగిన కొండా దంపతులు ఏ విధంగా స్పందిస్తారోనని వారి అనుచరులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు వేయికళ్లతో వేచి చూస్తున్నారు.

