పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు
ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి

విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ తల్లికి, కడసారి తన బిడ్డకే తలకొరివి పెట్టాల్సిన దుస్థితి ఎదురైంది. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన కమ్మగాని (తమ్మడపల్లి) యాకలక్ష్మి – కీ. శే దేవేందర్ గౌడ్ దంపతుల ఏకైక కుమారుడు శ్రీకాంత్ గౌడ్ (36) మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. భర్తను కోల్పోయిన యాకలక్ష్మికి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ మాత్రమే ఏకైక ఆధారం. చేతికి అందిన కొడుకు తనను వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకుంటాడని ఆశపడిన ఆ తల్లికి, విధి తీరని అన్యాయం చేసింది. కల్మషం లేని మనసుతో, శత్రువుని కూడా ప్రేమించే తత్వమున్న శ్రీకాంత్ మరణవార్త విని పాలకుర్తి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. శ్రీకాంత్ ఇంటికి పాలకుర్తి మండల ప్రజలు భారీగా చేరుకొని ఘన నివాళులు అర్పించారు. ఘన నివాళులు అర్పించిన వారిలో అన్ని పార్టీల నాయకులు, ప్రజలు తదితరులు వున్నారు. గురువారం జరిగిన అంతిమ యాత్రలో స్నేహితులు, బంధువులు వందలాదిగా తరలివచ్చారు.
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆ తల్లి, గుండెను రాయి చేసుకుని తన కొడుకు చితికి నిప్పు పెట్టి తలకొరివి పెట్టిన దృశ్యం చూసి అక్కడి వారందరూ కన్నీరు ఆపుకోలేకపోయారు. ఓ దేవుడా.. ఇది నీకు తగునా? అంటూ ఆమె పడుతున్న ఆత్మక్షోభ వర్ణనాతీతం. ఆప్యాయతకు నిలువుటద్దమైన శ్రీకాంత్ అర్థాంతరంగా నిష్క్రమించడం గ్రామంలో తీరని వెలితిని మిగిల్చింది.


