రుద్ర సంతోష్ కుమార్‌కు ఏఐసీసీలో కీలక బాధ్యతలు
హైదరాబాద్: తెలంగాణలో కులగణన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకు సమన్వయం చేసిన కాంగ్రెస్ నాయకుడు రుద్ర సంతోష్ కుమార్‌కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. జాతీయ జనగణనలో కులగణన అంశంపై దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 100 రోజుల క్యాంపెయిన్‌కు ఏఐసీసీ వార్‌రూమ్ కోఆర్డినేటర్లుగా గౌడ్ కిరణ్ కుమార్, రుద్ర సంతోష్ కుమార్, డా. వికాస్ యాదవ్, దీప్తి బత్తినిని నియమించినట్లు ఏఐసీసీ వెల్లడించింది. తెలంగాణలో 2024–25లో జరిగిన కులగణన సందర్భంగా రుద్ర సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో వార్‌రూమ్, కాల్ సెంటర్, డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థలను సమన్వయం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సుమారు 45 రోజులపాటు సాగిన కార్యక్రమంలో రోజుకు 2,000 మందికి పైగా కార్యకర్తలు, సంస్థాగత ప్రతినిధులతో సంప్రదింపులు జరిపినట్లు పేర్కొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 100కుపైగా కుల సంఘాలు, సుమారు 35 వేల మంది బూత్ స్థాయి కార్యకర్తలతో సమన్వయం చేసినట్లు వెల్లడించాయి. తాజాగా ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగిన వర్క్‌షాప్‌లో 100 రోజుల క్యాంపెయిన్‌కు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రుద్ర సంతోష్ కుమార్ సుమారు 45 నిమిషాల పాటు వివరించారు. రాష్ట్ర స్థాయి వార్‌రూమ్‌లు, మాస్టర్ ట్రైనర్ల ఎంపిక, జిల్లా స్థాయి శిక్షణ, మండల–గ్రామ స్థాయి విస్తరణ, డిజిటల్ మానిటరింగ్, వారపు పురోగతి నివేదికలు, రాష్ట్రాల మధ్య సమన్వయంపై ప్రణాళికను వివరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలోని క్షేత్రస్థాయి అనుభవాన్ని జాతీయ స్థాయిలో 100 రోజుల కార్యక్రమానికి వినియోగించే బాధ్యతలు ఆయనకు దక్కడం చర్చనీయాంశంగా మారింది.

