ఇల్లు కట్టి సూడు, పెండ్లి శేసి సూడన్నరు. గయి రెండంటే గంత కట్టమన్నట్లు.? పెండ్లంటే గిప్పట్ల సిడెంల అయిపోతానయి గనీ, గీ ఇండ్లంటేనే గవాటి టైం గయి తీసుకుంటయి. మట్టి, సిమెంటు, ఇటికె, ఇసికె, కంకర, నీల్లతోటి.. పునాది, పిల్లర్లు, గోడలు, టాపులు కాసింత నీల్లు తాగడానికైనా టైం పడ్తది. అసలు గివీటన్నింటితోటి పని లేకుండనే ఇల్లైతే? నిజంగనే తొందరగ అయితది. గిసొంటి ఉపాయం ఒకటి ఆలోసించిండ్రు. గదేందో సూద్దాం పాండ్రి.

లింకు ఇటికెలని.. ఒక రకం ఇటికెలను తయారు శేసిండ్రు. ఇగ గవి మూడు వైపుల సమానంగుంటయి. ఒకవైపేమో ఒంకలు తిరిగుంటయి. గవాటి మద్దెల ఇనుప శీకులు పెట్టి, ఒకవైపు దారం కట్టి, ముందుగ గోడలెక్క పారుకు పెడ్తరు. ఇగ రెండో వైపున గవాటిని గా ఒంకల్ల మిగతా వాటిని పొందిత్తరు. గంతే, ఇగ గోడలు తయారు. సిమెంటు నాకిచ్చుడు లేదు. అస్తర్ కార్ లేదు. ఇగ గయి గాలికి కూలయి. నూకితే కాదు, తన్నినా పడిపోవు. ఇగ గవాటికి నీల్లు కొట్టుడు గూడా లేదు. గా గోడ ఇటికెల మద్దెల సందుండుట్ల యేడి కూడా రాదట. ఇల్లు సల్లగుంటదట. మంచిగుంది కదా గీ ఇకమతు.?

