తెలంగాణలో వచ్చే నెల నుంచి ఎండల తీవ్రత పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు పొగమంచు ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు.
తూర్పు, ఈశాన్య జిల్లాలతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పొగమంచు ఎక్కువగా కనిపిస్తోందని, తెల్లవారుజామున చలిగా ఉండి పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వివరించారు. తూర్పు, ఆగ్నేయ గాలుల కారణంగా ఈ పరిస్థితి చోటు చేసుకుంటోందని చెప్పారు.
ఫిబ్రవరి 15 వరకు వాతావరణంలో భిన్న పరిస్థితులు కొనసాగుతాయని, అప్పటి వరకు ఒక్కోసారి చల్లగాలులు, మరొకసారి వేడిగాలులు వీస్తాయని డాక్టర్ నాగరత్న తెలిపారు. ఫిబ్రవరి 15 తర్వాత ఎండల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
ఈ ఏడాది వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని, వడగాలులు కూడా వీచే అవకాశముండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

