మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తన సహజ స్వభావానికి భిన్నంగా మంగళవారం ఉదయం మేడ్చల్ జిల్లా పోచారంలో ఉగ్రరూపం ప్రదర్శించారు. పేదల భూములను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అక్రమంగా ఆక్రమించాడనే ఫిర్యాదుల నేపథ్యంలో, బాధితులు తమ భూములపై న్యాయం చేయాలని ఎంపీ ఈటలను వేడుకున్నారు. ప్రజల సమస్యను పరిష్కరించేందుకు ఆయన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బ్రోకర్‌ను ప్రశ్నించారు. అయితే చర్చ సమయంలో ఈటల తీవ్రంగా కోపోద్రిక్తుడై, రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ను చెంప చెళ్లుమనిపించారు.
ఈ ఘటనతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎంపీ అనుచరులు, బీజేపీ నేతలు కూడా ఆగ్రహంతో బ్రోకర్‌పై దాడికి దిగారు. ప్రజలు ఈటల చర్యపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. పేదల పక్షాన నిలిచిన ఆయన తీరును కొందరు ప్రశంసిస్తుండగా, మరికొందరు ఓ ప్రజా ప్రతినిధిగా ఇలాంటి చర్య తగదని అంటున్నారు. ఈ వ్యవహారంపై అధికారుల స్పందన కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

