కొండా సురేఖకు అధిష్ఠానం అల్టిమేటం..
ఇంటి వద్ద నిర్మానుష్యం
పార్టీ లైన్ దాటని అనుచరులు
తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం సురేఖకు స్పష్టంగా సూచించినట్లు సమాచారం. సాయంత్రంలోగా రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం సురేఖతో మాట్లాడి, పరిస్థితిని బర్తరఫ్ వరకు తీసుకెళ్లకుండా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే పునరాలోచించాలని సురేఖ కోరినా అధిష్ఠానం నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం. దీంతో బర్తరఫ్ కంటే తానే రాజీనామా చేయడం మంచిదనే నిర్ణయానికి ఆమె వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీలో కొనసాగడం కంటే కాంగ్రెస్‌కు కూడా రాజీనామా చేయాలా అనే అంశంపై కొండా దంపతులు అనుచరులతో చర్చిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, కొండా సురేఖ ఇంటి వద్ద నిర్మానుష్యం నెలకొంది. సాధారణంగా అనుచరులు, కార్యకర్తలతో సందడిగా కనిపించే హన్మకొండ, హైదరాబాద్‌లోని కొండా కుటుంబ నివాసాల వద్ద ప్రస్తుతం పెద్దగా ఎవరూ కనిపించడం లేదని సమాచారం. మరోవైపు పార్టీ లైన్ దాటకుండా అనుచరులు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ‘పార్టీయే ముఖ్యం.. వ్యక్తులు కాదు’, ‘మీరు వద్దు అంటున్నారు’ అనే భావనతో అనుచరులు దూరంగా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు కొండా దంపతులు మీడియా ముందుకు రానున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మంత్రి పదవికి, పార్టీకి సంబంధించిన తమ భవిష్యత్ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రాజీనామా, బర్తరఫ్, పార్టీ వీడే అంశాలపై అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.

