కేటీఆర్ పై కేసు రేవంత్ రెడ్డి డ్రామా – మాజీ మంత్రి హరీష్ రావు
తెలంగాణలో నూతన సంవత్సర బిఆర్ఎస్ పార్టీ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి తనకు పైకేసులు పెట్టించడం రివెంజ్ రాజకీయాలకి ఉదాహరణ అని కెటిఆర్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు పడిన ఇబ్బందులతో పోలిస్తే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు పెద్ద సమస్యలుగా భావించడం లేదని అన్నారు. కేసీఆర్ రక్తం పంచుకుని పుట్టిన తనను, కేసీఆర్ సిద్ధం చేసిన సైనికుడిని ఈ చిన్నకేసుల కోసం భయపడే ప్రసక్తే లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించిన కెటిఆర్, రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎక్కడ అమలయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోలేదని, ప్రతి రైతుకి ఎకరానికి రూ.17 వేల బాకీ ఉందని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 2024లో బిఆర్ఎస్ పునరభిషేకానికి పునాది వేస్తున్నామని, రైతన్నలు, తెలంగాణ ప్రజల కోసం పోరాటాన్ని ముమ్మరం చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.
ఇదే సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, బిఆర్ఎస్ పై కేంద్రం, కాంగ్రెస్ కలిసికట్టుగా కుట్రలు పన్నుతున్నాయని, తెలంగాణ ప్రజలు ఈ డ్రామాల్ని నమ్మరన్నారు. బిఆర్ఎస్ సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని, పథకాల అమలులో బిఆర్ఎస్ కట్టుబడి ఉందన్నారు. రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేసులు పెట్టించారని, బిఆర్ఎస్ నిర్మించిన ప్రాజెక్టులపై రిబ్బన్లు కట్టడం కాంగ్రెస్ చరిత్రకు అద్దం పడుతుందన్నారు.
రేవంత్ రెడ్డి కుటుంబ భూముల కోసం ఆరు లైన్ల రోడ్లు వేయిస్తుండగా, రైతులకు తగిన న్యాయం చేయలేకపోతున్నారని విమర్శించారు. ఏపీలో ప్రభుత్వం రైతులకు రూ.4,000 పెన్షన్ ఇస్తుంటే, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒక్కో కేసీఆర్‌గా మారి పోరాటం చేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో నూతన కమిటీలు, సభ్యత్వ నమోదు, పార్టీ శ్రేణుల ఏర్పాటుపై దృష్టి సారించనున్నట్లు ప్రకటించారు.

