మైక్రోసాఫ్ట్ భారత్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. కంపెనీ ఛైర్మన్, సిఈఓ సత్య నాదెళ్ల ప్రకటన ప్రకారం, దేశంలో క్లౌడ్, కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాలను విస్తరించేందుకు డేటా సెంటర్లను అభివృద్ధి చేయడానికి మైక్రోసాఫ్ట్ 3 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. ఈ మేరకు బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో నాదెళ్ల మాట్లాడుతూ, భారత్లో ఏఐ ఆవిష్కరణలు మరింత వేగవంతమవుతాయని తెలిపారు. 2030 నాటికి 10 మిలియన్ల మందికి ఏఐ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాలనే లక్ష్యాన్ని సంస్థ నిర్దేశించుకుంది.
ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న సత్య నాదెళ్ల, సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. భారత్‌ను ఏఐ రంగంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పెట్టుబడులు 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న ప్రధాని మోదీ లక్ష్యానికి తోడ్పడతాయని నాదెళ్ల అన్నారు. లింక్‌డిన్ గణాంకాల ప్రకారం, భారతీయులు ఏఐ నైపుణ్యాలు నేర్చుకోవడంలో ముందుంటున్నారని, గ్లోబల్‌గా 71% వృద్ధి నమోదైన దశలో, భారత్లో 122% వృద్ధి సాధించారన్నారు. ‘అడ్వాంటేజ్ ఇండియా’ కార్యక్రమం కింద గత లక్ష్యాలను ముందుగానే చేరుకున్న మైక్రోసాఫ్ట్, భవిష్యత్‌లో మరింత వ్యాప్తి కోసం ప్రయత్నిస్తోంది.

