పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ నరుకుతున్నం. గందుకే గీ వానలు పడీ పడక కరువు కాటకాలొత్తానయి. ఎల్నినో అసొంటియి గూడ గియేమరి. మరి గివీటినుంచి బయటపడటానికి గా మహారాస్ట్ర ఛత్రపతి శంభాజీనగర్ ల ఓ ఉద్యమం శేత్తాండ్రు. గదే ‘మొక్కల్ని నాటుండ్రి.. లాభ పడుండ్రి‘.

అతుల్ రత్నపార్ఖీ అనేటాయినె రత్నపార్ఖీ అనే సేవా సంస్థని పెట్టిండు. రూ.51 గా సంస్థికి కడితే, గవాల్లే ఇంటికి ఒక మొక్కను నాటుతరు. గదాన్ని జియో ట్యాగింగు శేత్తరు. గా మొక్కను ఎట్ల పెంచుతాండ్రో ఎప్పటికప్పుడు సూత్తరు. మంచీ చెడు చెప్తరు. గా మొక్కను పెంచుతున్నందుకు వైద్య పరీచ్చలు, హోటల్ బిల్లులు, బడి పీజులు, మంగళి దుకాణాలు, బండ్ల సర్వీసింగులు, కరెంటుతో నడిసే ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర ధరలు తగ్గించి ఇత్తరు. ఒకేల గా మొక్క పెరగలేదనుకోండ్రి.. గియన్నీ యెంటనే ఆగిపోతయి. ఎట్లుంది గీ ట్రెండు? మన దగ్గర గూడ సురువు శేద్దామా?

