10 MEMBERS DEATH| 10 మంది దుర్మరణం, పలువురి పరిస్థితి విషమం
ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మున్సిపాలిటీలోని పాశమైలారంలో ఉన్న సీగాచి కెమికల్స్ పరిశ్రమలో సోమవారం ఉదయం 9 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందగా, వీరిలో ఐదుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. శిథిలాల కింద ఇంకా 15 మంది పని చేస్తున్నట్టు అనుమానం వ్యక్తమవుతోంది. రెస్క్యూ కార్యకలాపాల్లో భాగంగా ఇప్పటివరకు కేవలం ఆరుగురిని మాత్రమే బయటకు తీశారు.

ప్రమాద స్థలానికి 8 ఫైరింజన్లు, హైడ్రా, పోలీసు బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. పరిశ్రమలో సంభవించిన ఈ పేలుడు పటాన్‌చెరు పరిసర ప్రాంతాల్లో భారీ ఆందోళనకు కారణమైంది. ఘటనపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించగా, పరిశ్రమ యాజమాన్యానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.
ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అత్యవసరంగా అన్ని సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు వెంటనే అందించాలని, ప్రమాదానికి గల కారణాలను తేల్చేందుకు విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. అలాగే బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

