రైతు బంధు పథకం వ్యవసాయానికి మాత్రమే పరిమితమై ఉండాల్సి ఉన్నా, సుల్తానాబాద్ పట్టణంలో వాణిజ్య సముదాయాలు, సినిమా హాళ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఈ పథకం కింద నిధులు అందిన వివాదాస్పద అంశాలు వెలుగుచూశాయి.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్, శ్రీరామా సినిమా టాకీస్, ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ వంటి వాణిజ్య సంస్థలకు రైతు బంధు సాయం అందినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూములు వ్యవసాయానికి అనర్హమైనవైనా, అక్రమంగా రైతు బంధు పథకం ద్వారా లబ్ధిపొందినట్లు తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, వ్యవసాయాధికారి స్వప్న వెల్లడించారు.
సర్వేలో నలభై ఎకరాల భూములు వ్యవసాయానికి అనర్హమైనవిగా గుర్తించడంతో పాటు, వాటిని రైతు బంధు పథకం అనర్హులుగా ప్రకటించారు. సాగుకు అనర్హమైన భూములకు సాయం నిలిపివేయాలని, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ఇదే తరహా మరిన్ని అక్రమ రికార్డులను గుర్తించి చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తెలిపారు.

