పెండ్లిల్లు సొర్గంల నిర్ణయిత్తరట. ఎవలితో? ఎక్కడ? ఎప్పుడు? ఎట్ల జరగాల్నో? గాడనే తేలుత్తరట. గవాటి సంగతేమో! గనీ, గీ మద్దెల భూమ్మీద మనువులు మాత్రం మానవులే నిర్ణయిత్తాండ్రు. గా అమెరిక అధ్యచ్చుడు ట్రంపు ఇరాన్ మీద యుద్ధం సేయబట్టి, సుంకాలను పెంచబట్టి, యీసాల మార్సబట్టి గా మనువులు గూడా మస్తుగ మారబట్టినయి. గిప్పుడు గా దేసం ఇడిసి వత్తే, మల్ల పోతమో లేమోననే బెంగతోటి, మనుసులు కలిసిన పోరగాండ్లు మనువులు గాడనే శేసుకుంటాండ్రు. గట్ల గీ మద్దెల మస్తు పెండ్లిల్లు జరుగుతానయి. గసొంటిదే గిది.

సూర్యాపేట జిల్ల హుజూర్‌నగర్ మండలం, యేపల సింగారం ఊరి పిల్ల హిమబిందు అమెరికకు పోయింది. గాడనే, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రోహిత్ కుమార్‌ను పేమించింది. ఇగీడికి వచ్చి మనువాడుడు మాటలతో పని కాదని, ఇగాడనే పెండ్లి తంతు కానిచ్చిండ్రు. ఇగ గవాల్ల తల్లిదండ్రులు గా మనువును గీడి నుండే ఆన్ లైన్ల సీన్మా సూసినట్లు సూసుకుంట, అచ్చింతలు యేసిండ్రు. గంతే కాదుల్లా… గాయింత గా పెండ్లికి సుట్టుముట్టోల్లు, సుట్టాలను పిలిసి, విందు భోజనం కూడా పెట్టి పంపిండ్రంట. సావులే కాదుల్లా.. మనువులు కూడా ఆన్ లైన్లల్లనే జరగబట్టె. ఇదేం పొయ్యే కాలమో ఏమో మరి!

