ఖమ్మం జిల్లా, ఇల్లందు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ఆదివాసి హక్కుల పోరాట యోధుడు గుమ్మడి నరసయ్యకు చింతలపల్లి నిర్మలాదేవి నారాయణరావు జీవన సాఫల్య పురస్కారం – 2025 అందజేయనున్నట్లు సిఎన్ఆర్ మెమోరియల్ సొసైటీ బాధ్యులు సి. భాస్కరరావు తెలిపారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 5న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10 గంటలకు జరుగుతుందని, శాసనమండలి సభ్యులు కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, గోరటి వెంకన్న, మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. గుమ్మడి నరసయ్య ఐదు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికై, రైతుల హక్కుల కోసం పోరాడిన ప్రజా నాయకుడు అని చెప్పారు. గతంలో దుశర్ల సత్యనారాయణ, కమ్యూనిస్టు రంగమ్మ తదితరులు ఈ పురస్కారం అందుకున్నారని తెలిపారు. ఈ పురస్కారంతో నరసయ్యకు రూ. 25,000 నగదు, శాలువా, మెమొంటోతో సత్కరిస్తామని భాస్కర్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కళాకారులు, ప్రజలు భారీ ఎత్తున హాజరై ఈ సభను జయప్రదం చేయాలని కోరారు.


