శిరివెళ్లమెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
బస్సు–లారీ ఢీ, ముగ్గురు మృతి
నంద్యాల/శిరివెళ్ల, జనవరి 22 (అడుగు న్యూస్):
నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, పదిమందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు వెళ్తున్న ఏఆర్బీసీవీఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత ప్రమాదానికి గురైంది. బస్సు ప్రయాణంలో ఉండగానే టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొంది. ఢీకొన్న వెంటనే బస్సుకు మంటలు చెలరేగి కొద్దిసేపటికే పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందగా, వారి మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో కాలిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆ దారిన వెళ్తున్న డీసీఎం వాహన డ్రైవర్ వెంటనే స్పందించి తన వాహనాన్ని ఆపి బస్సు అద్దాలను పగులగొట్టడంతో పలువురు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కిటికీల్లోంచి దూకిన సమయంలో పదిమందికిపైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో లారీ కూడా పూర్తిగా కాలిపోయింది. బస్సులోని ప్రయాణికుల లగేజీ మొత్తం బూడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమాచారం తెలియగానే నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఆళ్లగడ్డ డిఎస్పీ ప్రమోద్ కుమార్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


