ఒకాయినెకు ఓ అవుడియా వచ్చింది. తానే బిచ్చమెత్తితే? గట్ల బిచ్చమెత్తి రోజుకు ఎంత సంపాయించొచ్చు? గదాంట్ల ఉండే సాదకబాదకాలు తెలుసుకుందామని. ఇగ ఆగకుండ ఐవుడియా వచ్చిందే లెక్క… యెంటనే ఆ అవతారమెత్తిండు. ఆఖరికి సంపాయించింది ఊహించిందానికంటే ఎక్కువయ్యే సరికి, అవాక్కైండు!?

గాయినె పేరు పురుషోత్తం వశిష్ట్. గాయినె శేసే పని యూట్యూబర్. అంటే గా యూ ట్యూబ్ ల ఈడియలు శేసి ఏసుడున్నట్లు. గా బిచ్చమెత్తుట్ల ఉండే కట్టాలు కనుక్కుడే గాక, రోజుకు ఎంత సంపాయించొచ్చో తెల్సుకుందామని, తన దోస్తు సచిన్ తో కల్సి, సినిగిన బట్టలేసుకున్నడు. మొకానికి నల్ల రంగు పూసుకున్నడు. మెడల క్యూ ఆర్ కోడ్ బోర్డు యేసుకున్నడు. శేతిల ఓ బొచ్చ పట్టుకున్నడు. హరిద్వార్ యీథుల్ల, వాడల్ల అడుక్కునుడు మొదలు పెట్టిండు. కనిపించిన పతి ఒక్కల్ని అడిగిండు. గట్ల ఓ రెండేలు వత్తే సాలనుకున్నడు. కనీ, నాలుగేలు వచ్చే సరికి పరేషాన్ అయిండు.
అడుక్కుంటే ఆదాయం బాగనే ఉంది కనీ, గీ అడుక్కునుడే మస్తు కట్టంగుందని గుర్తించిండు. ఎర్రటి ఎండల అలుపెరగకుండ అడుక్కునుడు. కొందరి సులకన సూపులు, ఈసడింపులు, కసురుకునుడు, విసురుకునుడు, విసుక్కునుడు, సిల్లర లేవని సికాకులు. అభిమానం సంపుకోవాలె. అవమానాలు భరించాలె. ఇచ్చినా, ఇయ్యకపోయినా, మనిసి మనిసికి అడగాలె. ఇగ గియన్నీ భరించి అక్కునుడు కంటే, కట్ట పడి పని శేసుడే బాగుందనే సందేశమిచ్చిండు గా యూ ట్యూబర్.

