1500 కుటుంబాలను కుల బహిష్కరణ చేసినట్లు ఆరోపణలు!|NIZAMABAD|OUT CASTING
నిజామాబాద్ జిల్లా, బాల్కొండలో దాదాపు 1500 కుటుంబాలను సామాజికంగా బహిష్కరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) నిర్ణయాల కారణంగా గౌడ, పద్మశాలి, ముస్లిం వర్గాలకు చెందిన కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. పట్టణానికి చెందిన డాక్టర్ రాజుతో జరిగిన భూ వివాదాన్ని కారణంగా చూపుతూ 300కు పైగా పద్మశాలి కుటుంబాలపై సామాజిక బహిష్కరణ విధించినట్లు సమాచారం. వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించవద్దని, పాలు, పెరుగు వంటి నిత్యావసర వస్తువులు కూడా విక్రయించవద్దని గ్రామంలో ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాకుండా మున్నూరు కాపు వర్గానికి చెందిన ఇళ్లలో అద్దెకు నివసిస్తున్న పద్మశాలి కుటుంబాలను ఇళ్లు ఖాళీ చేయించాలని ఒత్తిడి తెస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. కొంతమంది ఇంటి యజమానులు దుకాణాలు, వ్యాపార సముదాయాలు కూడా ఖాళీ చేయించాలని కోరుతున్నారని చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వ భూములపై అక్రమ నిర్మాణాలు, భూ కబ్జాలకు సంబంధించిన వివరాలను ఆర్టీఐ ద్వారా సేకరించిన ఇద్దరు గౌడ కులస్తులపై కూడా చర్యలు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీడీసీ నిర్వహించిన సమావేశ ఖర్చుల పేరుతో రూ.3 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేయగా వారు నిరాకరించడంతో సామాజిక బహిష్కరణకు గురయ్యారని చెబుతున్నారు.
ఇదే సమయంలో ఖభరిస్తాన్ ప్రాంతంలోని సమాధుల వివాదంపై గతంలో ఫిర్యాదు చేసిన ముస్లింలపై కూడా కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చి, అద్దె ఇళ్ల నుంచి ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధితులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ప్రజాసంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

