ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖలతో పాటు ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. తాజా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్కకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి, తక్షణమే హైదరాబాద్‌కు బయలుదేరాల్సిందిగా సూచించారు. హైదరాబాద్ దేశ రక్షణలో వ్యూహాత్మక ప్రాంతంగా ఉండటంతో కేంద్ర రక్షణ విభాగాలకు ఇది ప్రధాన స్థావరంగా మారింది. ఈ నేపథ్యంలో ఏ ప్రమాద పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేలా అన్ని విభాగాలు సన్నద్ధంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రం నిర్వహించనున్న మాక్ డ్రిల్‌ను ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించనున్నారు.

