-అచ్చిరాని ‘మూడు ముళ్ళు’!
-మూన్నాళ్ళ ముచ్చటగా పెళ్ళిళ్ళు!!
-ముచ్చటగా.. మూడో ‘సారీ..’!!!
పాపం పవన్ కళ్యాణ్! మూడు పెళ్లిళ్లు.. రెండు విడాకులు.. ఇప్పుడు మూడో బంధానికీ ముగింపు! ఎందుకనో?, సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పెళ్ళిళ్ళు అచ్చొచ్చినట్లు లేవు. పెండ్లంటే నూరేండ్ల పంట.. అంటారు కానీ, పవన్ కి పెండ్లంటేనే తంటా.., మూన్నాళ్ళ ముచ్చటగానే ముగుస్తున్నాయి. ఒకటా?, రెండా?? మూడో మూడుముళ్ళ ముచ్చటా ముగిసింది. పవన్ వ్యక్తిగత జీవితం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది.
సినీ అగ్ర కథానాయకుడు, రాజకీయాల్లో జనసేనకు చారిత్రాత్మక విజయాన్నందించిన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. రాజకీయంగా కంటే వ్యక్తిగత ఆయన వివాహ జీవితమే తరచూ వివాదాల్లో నిలుస్తుండటం ఆయన జీవిత కథలో అనుకోని అనూహ్య సినిమా మలుపులు. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ పవన్ కళ్యాణ్, ఆయన 3వ భార్య అన్నా లెజ్నెవా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు నవంబర్ 9న సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దీంతో ఆయన మూడో వివాహ బంధం విడిపోగా, మూడు వివాహాల ముచ్చట మరోసారి చర్చనీయాంశమైంది.
1997లో విశాఖపట్నానికి చెందిన నందినితో పవన్ కళ్యాణ్ కు పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. అయితే, ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 1999లోనే విడివిడిగా జీవించడం ప్రారంభించారు. 2007లో నందిని న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, 2008లో విడాకులు చట్టబద్ధంగా ఖరారయ్యాయి. కాగా వీరికి పిల్లలు లేరు.
‘బద్రి’ సినిమా సమయంలో పరిచయమైన నటి రేణు దేశాయ్-పవన్ కళ్యాణ్ ల మధ్య ప్రేమ చిగురించింది. వీరికి 2004లో అకీరా నందన్ జన్మించగా, 2009 జనవరిలో పెళ్ళి చేసుకున్నారు. 2010లో ఆద్య పుట్టింది. అయితే, ఈ బంధం కూడా ఎక్కువకాలం కొనసాగలేదు. 2012లో విడాకులు తీసుకున్నారు.
రష్యాకు చెందిన అన్నా లెజ్నెవాతో 2013 సెప్టెంబర్‌లో పవన్ వివాహం జరిగింది. వీరికి పోలెనా అంజనా పవనోవా, మార్క్ శంకర్ పవనోవిచ్ ఇద్దరు పిల్లలు పుట్టారు. 13 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం 2026 నవంబర్ 9న పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే, చట్టబద్ధ విడాకుల ప్రక్రియ పూర్తయినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు. గతంలో పవన్ రాజకీయ ఆరంగేట్రం సమయంలో ఈ పెళ్ళిళ్ళ గోల వచ్చినప్పుడు ఎందుకనో? తనకు పెండ్లిళ్ళు నిలవడం లేదని పవన్ తన నిర్వేదాన్ని వ్యక్తం చేశారు. వ్యక్తిత్వాలు, వ్యక్తిగత అంశాలు, పరస్పర గౌరవాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, కోపతాపాలు, సహనాలు, సర్దుకుపోవడాలు వంటి అనేక అంశాలతో ముడిపడే ఆ మూడు ముళ్లు, ఎందుకు నిలవడంలేదో బహుషా! పవన్ కళ్యాణ్ కానీ, విడిపోయిన ఆయన భార్యలు కానీ చెప్పాలి. లేకపోతే సమాజమే సహానుభూతితో కాపోయినా, సానుభూతితో అర్థం చేసుకోవాలి.
ఈ మూడు పెళ్ళిళ్ళు, రెండు చట్టబద్ధ విడాకులు, మూడో బంధం ముగింపుపై ప్రకటన.. ఇదీ పవన్ ప్రస్తుత వైవాహిక జీవిత ప్రస్థానం. పవన్ కళ్యాణ్ పేరున్న నటుడు, సెలబ్రిటీ అవడం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన రాజకీయ పార్టీకి అధ్యక్షుడు కూడా అవడం వల్ల ఆయన వైయక్తిక వైవాహిక జీవితం వ్యక్తిగతాలను దాటి సమాజం, మీడియా, సామాజిక మీడియాలో సమున్నతంగా చర్చ జరుగుతోంది. ఒకవైపు విపక్షాల విమర్శలు, మరోవైపు సామాజిక మాధ్యమాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు మరో మహిళతో త్వరలోనే నాలుగో పెళ్ళంటూ ప్రచారం కూడా జరుగుతోంది.
అయితే, వ్యక్తిగత నైతిక జీవితాన్ని రాజకీయ విమర్శలకు ఆయుధంగా మార్చడం సమంజసం కాదు. నేతగా ఆయన పరిపాలనా తీరును, పటిమను ప్రశ్నించవచ్చు కానీ, ఆయన మాజీ, తాజా భార్యలు తమకు అన్యాయం జరిగిందని బయట పడనంత వరకు, వారి కుటుంబ వ్యవహారాల గోప్యతను గౌరవించడం కూడా సమాజ నైతిక బాధ్యతే.! ఏమంటారు?

