పటాన్‌చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా మహిపాల్ రెడ్డి అనుచరుడు యాదగిరి నామినేషన్ దాఖలు చేయడం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొనడంతో కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించిన తర్వాత, మహిపాల్ రెడ్డి అనుచరుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడం కాంగ్రెస్ సీనియర్ నేతల ఆగ్రహానికి కారణమైంది. మహిపాల్ రెడ్డిపై ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం సన్నాహాలు చేస్తోంది. మహిపాల్ రెడ్డి పార్టీ అధిష్ఠాన నిర్ణయాన్ని తుంగలో తొక్కుతున్నారని ఒరిజినల్ కాంగ్రెస్ వర్గం మండిపడుతోంది. ఇదివరకు కూడా పార్టీ నిర్ణయాలను ఉల్లంఘించిన సందర్భాలు ఉన్నాయని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలు టీపీసీసీ దృష్టికి వెళ్లడంతో పార్టీ అధిష్ఠానం మహిపాల్ రెడ్డిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

