మేడారం జాతరలో అపూర్వ ఆచారం
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తీసుకువచ్చే సమయంలో నిర్వహించే నీళ్ల హారతి ప్రత్యేక ఘట్టంగా నిలుస్తుంది. సాధారణంగా దేవతలకు కర్పూరంతో హారతి ఇస్తారు. కానీ మేడారంలో తల్లీకూతుళ్లకు ఇచ్చే ఈ నీళ్ల హారతి సంప్రదాయం గిరిజన సంస్కృతికి ప్రతీకగా ఉంటుంది. కన్నెపల్లి గ్రామం నుంచి సారలమ్మను వెదురు బుట్టలో ఉంచుకుని పూజారి గద్దెల వైపు వస్తుండగా, గ్రామ మహిళలంతా తమ ఇంటి ముందు నిలబడి దేవతకు స్వాగతం పలుకుతారు. వెడల్పాటి పళ్లెంలో నీళ్లు పోసి, అందులో పసుపు, కుంకుమ కలిపి, చిన్న దీపాలను వెలిగించి దేవతకు ఎదురుగా నీరాజనాలు అర్పిస్తారు. ఈ ఆచారాన్నే నీళ్ల హారతిగా పిలుస్తారు.
సారలమ్మ అడవిలో నుంచి గ్రామానికి వస్తున్న సమయంలో ఆమెకు ఎలాంటి దుష్టశక్తుల ప్రభావం పడకుండా, ఉగ్రరూపాన్ని శాంతింపజేయాలనే నమ్మకంతో ఈ హారతి ఇస్తారు. కన్నెపల్లి మహిళలు సారలమ్మను తమ పుట్టింటి ఆడబిడ్డగా భావించి, అత్తగారింటికి వెళ్లే కూతురిని ప్రేమతో సాగనంపినట్లుగా నీళ్ల హారతులతో వీడ్కోలు పలుకుతారు. ఈ సమయంలో దారి పొడవునా మహిళలు పూనకంతో ఊగిపోతూ, పళ్లెంలోని నీళ్లను దేవత పాదాల చెంత చల్లుతారు. ఈ దృశ్యం భక్తుల్లో అపూర్వ భావోద్వేగం, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. జంపన్న వాగులో స్నానం చేసి, పసుపు నీళ్ల కుండలతో గద్దెల వరకు మోసుకెళ్లడం కూడా ఈ సంప్రదాయంలో ఒక భాగమే.

