మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలను ఎంపిక చేయడంలో పారదర్శకత పాటించాలన్నారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ప్రస్తుతం టీజీబీసీఎల్ కు సరఫరా చేస్తున్న కంపెనీలకు సులభతర వాణిజ్య విధానాన్ని అనుసరించాలని, కొత్త కంపెనీల ఎంపిక విషయంలో కట్టుదిట్టంగా ఉండాలని సూచించారు. కొత్త కంపెనీలు తమ బ్రాండ్ల పేర్లతో దరఖాస్తు చేసుకోవాలని, వాటి నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యాలను పరిశీలించి ఎంపిక ప్రక్రియ నిర్వహించాలన్నారు.
ఎక్సైజ్ శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో, యునైటెడ్ బేవరేజెస్ కంపెనీ బీర్ల రేట్లను 33.1% పెంచాలని ఒత్తిడి చేసిందని తెలిపిన అధికారులు, కంపెనీల ఒత్తిడి కింద తలొగ్గేది లేదని, పొరుగునున్న రాష్ట్రాల బీర్ల ధరలను పరిశీలించాలని సీఎం సూచించారు.
ధరల పెంపుపై హై కోర్ట్ రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని, గత ప్రభుత్వ బకాయిలను క్రమంగా క్లియర్ చేయాలని ఆర్ధిక శాఖ అధికారులకు ఆదేశించారు.

