తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లపై టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం కీలక ప్రకటన చేశారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల నోటిఫికేషన్లు 2025 ఏప్రిల్ తర్వాత విడుదల చేస్తామని స్పష్టం చేశారు. 2025 మార్చి 31లోపు పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలు అందజేస్తామని తెలిపారు. ఫలితాల విడుదలలో జాప్యం లేకుండా, తక్షణమే ఫలితాలు ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వచ్చే వారం నుంచి పదిరోజులలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించారు.
సిలబస్‌లో మార్పులు తీసుకువస్తామని, గ్రూప్-3కి మూడు లేదా నాలుగు పేపర్లు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నమూనాను అనుసరించాలని భావిస్తున్నామని, టీఎస్‌పీఎస్సీలో కొన్నింటిని కంప్యూటర్ బేస్డ్, మరికొన్నింటిని మ్యానువల్ విధానంలో నిర్వహించేందుకు ఆలోచిస్తున్నట్లు చెప్పారు. క్వశన్ పేపర్ విధానం మార్చాలని నిర్ణయించామని, ముందుగా క్వశన్ బ్యాంక్ తయారు చేసి దాని నుంచి పేపర్లు సిద్ధం చేస్తామని వివరించారు.
మార్చి 31లోపు వెకెన్సీ లిస్ట్ ప్రభుత్వం నుంచి అందిన వెంటనే ఏప్రిల్‌లో కసరత్తు చేసి, మే 1 నుంచి కొత్త నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. ఇంటర్వ్యూ ఉన్న పోస్టులను ఏడాది లోపే, ఇంటర్వ్యూ లేని వాటిని 6-8 నెలల్లో ప్రాసెస్ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగులు టీఎస్‌పీఎస్సీపై అపనమ్మకాలు వీడి, నమ్మకంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

