టమాటా ధరలు భారీగా తగ్గిపోవడంతో రైతులు, మార్కెట్ వ్యాపారులు కుదేలవుతున్నారు. శివార్లలో రైతులు ధరలు గిట్టుబాటు కాకపోవడంతో తోటల్లోనే పంటను వదిలేస్తుండగా, కొందరు మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మకాలు లేకపోవడంతో రోడ్లపై పారబోస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో కిలో టమాటా ధర రూ. 15గా ఉండగా, ప్రస్తుతం కిలో రూ. 10కి పడిపోయింది.
మార్కెట్లోకి అధికంగా దిగుబడులు రావడం టమాటా ధరల పతనానికి ప్రధాన కారణం. గుడిమల్కాపూర్, మోండా, బోయిన్‌పల్లి, మాదన్నపేట, ఎల్‌బీనగర్ వంటి మార్కెట్లలో హోల్‌సేల్ ధర కిలోకు రూ. 3-8 కాగా, రిటైల్ మార్కెట్‌లో కిలో రూ. 7-10గా ఉంది.
నగరానికి రోజుకు 100-120 లారీలు సరిపోతే, ప్రస్తుతం 150 లారీలు వస్తున్నాయి. తెలంగాణ జిల్లాలతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ మొత్తంలో టమాటాలు దిగుమతవుతుండటంతో ధరలు మరింత తగ్గాయి. తెలంగాణ జిల్లాల నుంచి 30-40 లారీలు, పొరుగు రాష్ట్రాల నుంచి 90-120 లారీలు రోజూ వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఫిబ్రవరి రెండో వారం నుంచి దిగుమతులు తగ్గే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు భావిస్తున్నారు. అప్పటివరకు ధరలు తక్కువగానే ఉండే అవకాశముంది. అధిక సరఫరాతో సామాన్యులకు టమాటాలు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నప్పటికీ, రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.

