పలు కీలక అంశాలపై చర్చ
ఢిల్లీ: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నేతృత్వంలో బీజేపీ ఎంపీల బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసింది. ఈ సందర్భంగా పలు సమస్యలు, ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సఫాయి కర్మచారుల విషయంలో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్లకే అనేక రుగ్మతలతో వారు మరణిస్తున్నారని, కరోనా సమయంలో చేసిన సేవలను గుర్తించి ప్రధాని నరేంద్ర మోదీ వారి కాళ్లు కడిగి సత్కరించారని గుర్తుచేశారు. అయితే, చనిపోయిన సఫాయి కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే విషయంలో జాప్యం జరుగుతోందని తెలిపారు.
రక్షణ శాఖకు సంబంధించిన అంశాలపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన ఈటల రాజేందర్, సుచిత్ర వద్ద MMTS స్టేషన్ ఏర్పాటు, ఇతర సాంకేతిక అంశాలపై చర్చించారు. అనంతరం రైల్వే మంత్రితో సమావేశమై, ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలపై వివరించారు. నియోజకవర్గంలో రైల్వే అండర్‌పాస్‌లు, ఓవర్ బ్రిడ్జిల కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వందే భారత్ రైలు సర్వీసుకు తమ నియోజకవర్గంలో స్టాప్ ఇవ్వాలన్న అభ్యర్థనను కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఈటల రాజేందర్ ప్రశ్నించారు. వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన హామీలను అమలు చేయలేని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. బడ్జెట్ కేటాయింపులు జరిగినప్పటికీ, వాటిని అమలు చేయాలంటే HCU భూముల అమ్మకం వంటి అవివేకపూరిత చర్యలకు పాల్పడొద్దని హెచ్చరించారు. గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కూడా భూముల అమ్మకంపై ప్రతిపక్షంగా ఉన్నామని గుర్తు చేశారు. 12 వేల కోట్లు వస్తాయని బడ్జెట్‌లో చూపించినప్పటికీ తమ పార్టీ తేడా చెప్పిందని అన్నారు.
“తాతలు సంపాదించిన భూములను మనవళ్లు అమ్ముకుంటే ఏమంటారు?” అని ప్రశ్నిస్తూ, భూముల అమ్మకం ఎలాంటి ప్రభుత్వానికైనా తగదని అన్నారు. HCU భూములు విద్యార్థుల భూములని, అందుకే ఆందోళనలు ఉధృతంగా జరిగాయని తెలిపారు. నగరంలో ఇప్పటికే పచ్చదనం తగ్గిపోతోందని, భూముల్లో పరిశ్రమలు, విద్యాసంస్థలు పెట్టాలని, అమ్మకానికి పెట్టకూడదని స్పష్టం చేశారు.

