స్టీవెన్ స్పీల్ బర్గ్ తీసిన ‘ది టర్నినల్’ సినిమా చూసిండ్రా? గా సినిమాకు అసల్ కథ గీయినదే! మనిసి మనుగడ, జీవిత మజిలీలకు గీయినె జీవితమే ఉదాహరణ. గందుకే గా స్పీల్ బర్గ్ హాలివుడ్ స్థాయిల సినిమా తీసి యిజయం సాధించిండు.

గీయినె పేరు మెహ్రాన్ కర్రేమీ నస్సేరీ, గీయినెది ఇరాన్. 1945ల పుట్టిండు. బ్రిటన్ల సదువుకున్నడు. దేశ దేశాలు తిరిగిండు. శివరికి పారిస్ కు పోయిండు. గాడనే చిక్కుపడ్డడు. పాస్ పోర్టు, వీసా, గుర్తింపు కార్డులన్నీ పోగొట్టుకున్నడు. గంతే, గా దేశపోల్లు గీయినె ఏ దేశం వాడు? శరనార్థిగా సూడాల్నా? ఎట్లా? అనేది తేల్లేదు. గాయినె శెప్పినట్లు, తనను ఇరాన్ నుంచి బహిష్కరించినట్లు, బెల్జీయంకు శరణార్థిగా యెల్లినట్లు శెప్పితే, గదీ సరైంది కాదని తేలింది. ఇగ గిదంత పని కాదని, గాయన్ని గా యిమానాశ్రయంలనే ఉంచిండ్రు. గట్లనే 18ఏండ్లు గండ్లనే ఉండి పోయిండట.! పోనీ గాయినె కోసం ఏ దేశమూ, ఎవ్వలూ రాలేదట? గీ కథనే సినిమాగ తీసిన స్పీల్ బర్గ్ రూ.3 కోట్లిచ్చిండట! గవాటిని బ్యాంకులేసుకుని మిత్తీతోని కొంత కాలం బతికిండట! గట్లనే తిరిగి తిరిగి మల్లా పారిస్ యిమానాశ్రయానికే శేరుకుండంట. కొన్ని వారాల కింద 76 ఏండ్ల వయసుల గా యిమానాశ్రయంలనే సచ్చిపోయిండట! తిరిగి తిరిగి గాయినె జీవితం గాడనె ముగిసిందట!

