అడుగు EXCLUSIVE
కమలంలో కథనోత్సాహం-2
హిందూ జవ జీవం పరివ్యాప్తం!
పటిష్టంగా పార్టీ సంస్థాగత నిర్మాణం!
అనుబంధంగా అనేక సంస్థల అనుసంధానం!
ఆర్ఎస్ఎస్ గైడెన్స్ లో వ్యూహాత్మకంగా బిజెపి అడుగులు
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పశ్చిమ బెంగాల్ లో గత 10 రోజులుగా బెంగాల్ ప్రవాసీగా ఉంటున్నారు. ఆయన స్థాయిలో ఒకే చోట, అదీ బెంగాల్ లాంటి చోట్ల 10రోజులు ఉండటమనేది అసాధారణం! గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఖమ్మంలో విహెచ్ పి భజరంగ్ దళ్ లు కలిసి త్రిశూల ధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహా అయితే 200 లేదా 300 మంది వస్తే చాలని భావించారు. కానీ అనూహ్యంగా 3వేల మంది వచ్చారు. వాళ్ళంతా యువతే!! ఆ ఎన్నికలో బిజెపి గెలవలేదు కానీ, 7 అసెంబ్లీలకు కలిపి లక్ష ఓట్లకు పైగా సాధించింది. అంతకుముందు వేలల్లో మాత్రమే ఆ సంఖ్య ఉండేది. ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి, పార్లమెంట్ ఎన్నికల సమయంలో బిజెపికి ఓట్లేశారన్నది పక్కన పెడితే, తెలంగాణలో ఇప్పుడు 8 పార్లమెంటు స్థానాల్లో బిజెపి గెలిచి ఉంది. అంటే దాదాపు 56 అసెంబ్లీ స్థానాల్లో దాని ప్రభావం ఉంది. 8 అసెంబ్లీ స్థానాల్లోనూ గెలిచారు. అంటే రెండూ కలిపి 64 అసెంబ్లీ స్థానాల్లో బిజెపి ప్రభావం చూపింది?! ప్రస్తుతం బిఆర్ఎస్ ను ప్రజలు పట్టించుకోవడం లేదు సరే, ఒకవేళ కాంగ్రెస్ ఫెయిల్ అయితే!? బిజెపి కాస్త కష్ట పడితే…జరిగేదేంటి?
అవుర్ ఏక్ ధక్కా.. తెలంగాణలో పక్కా? ఇది బిజెపి నినాదం. ఆర్ఎస్ఎస్ కి రాజకీయ విభాగంగా పరిగణించబడిన జనసంఘ్ నుంచి 1980లో ప్రారంభించబడిన భారతీయ జనతా పార్టీ హిందూ అధిక సంఖ్యాక వర్గ మత సాంఘిక, సాంస్కృతిక విలువల పరిరక్షణే ధ్యేయంగా చెప్పుకుంది. సంప్రదాయ, సాంఘిక నియమాలు, దృఢమైన జాతీయ రక్షణ బిజెపి భావజాలం. ఆర్ఎస్ఎస్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంఘ్ పరివార్ కుటుంబానికి చెందిన వివిధ రకాల హిందూ జాతీయ వాద సంస్థలు బిజెపికి కార్యకర్తల స్థాయిలో గట్టిపునాదిని ఇస్తున్నాయి. ఆవిర్భావం నుండే కాంగ్రెస్ కు గట్టి ప్రత్యర్థిగా బిజెపి పని చేస్తున్నది. 1984 ఎన్నికల్లో కేవలం రెండు పార్లమెంటు సీట్ల (అందులో ఒకటి హనుమకొండ. చందుపట్ల జంగారెడ్డి పీవీ నర్సింహారావుపై గెలిచారు.)తో ప్రారంభించి, 44 ఏళ్ళుగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ ప్రస్తుతం హ్యాట్రిక్… వరసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది. దేశంలోని 15 రాష్ట్రాల్లో స్వతంత్రంగా, 6 రాష్ట్రాల్లో ఎన్డీఎ భాగస్వామ్య పక్షాలతో పంచుకుని మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బిజెపి పాగా వేసింది. ఒక్క దక్షిణ భారత దేశమే బిజెపికి కొరకరాని కొయ్యగా మారింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనే ఆ పార్టీకి ఇప్పటిదాకా పట్టు దొరకలేదు. 27ఏళ్ళ తర్వాత ఢిల్లీని దక్కించుకున్న బిజెపి ఇప్పుడు నూతనోత్సాహంతో తెలంగాణపై దృష్టి సారించింది. 2023 ఎన్నికల్లోనే ఆ పార్టీ తెలంగాణలో గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. నాయకత్వ లోపం కారణంగా సాధ్యంకాలేదు.
అయితే, ఇప్పుడా పార్టీ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా పటిష్టమైన పార్టీ నిర్మాణాన్ని చేపట్టింది. గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీతోపాటు అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తున్నది. ఇప్పటికే అన్ని గ్రామ, మండల, 28 జిల్లాల అధ్యక్షులను పార్టీ ప్రకటించేసింది. ఇక విద్యార్థి, యూత్ వింగ్ యువ మోర్చా పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పని చేస్తున్నది. మహిళా, కిసాన్ సంఘ్, మజ్దూర్ సంఘ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మోర్చాలు పని చేస్తున్నాయి. అలాగే విదేశాల కోసం ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బిజెపి అనే సంస్థ పని చేస్తున్నది.
ముందే చెప్పుకున్నట్లు ఆర్ఎస్ఎస్ కి రాజకీయ విభాగంగా పరిగణించబడిన జనసంఘ్ నుంచి వచ్చిన బిజెపికి ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంఘాల నుంచే కార్యకర్తలు వచ్చారు. ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలే బిజెపికి ఆయువుపట్టుగా పని చేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ కి దేశంలో 33వేల శాఖలు ఉన్నాయన్నది ఒక లెక్క. తెలంగాణలోనే ఆర్ఎస్ఎస్ వి 6వేల శాఖలు నడుస్తున్నట్లు అంచనా.162 దేశాల్లో ఆర్ఎస్ఎస్ శాఖలు పని చేస్తున్నాయి. మిగతా దేశాల్లో హిందూ సేవా సమితి, హిందూ స్వయం సేవక్ సంఘ్ వంటివెన్నో లెక్కలేనన్ని పేర్లతో నడుస్తున్నాయి. విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్, బిఎంఎస్, ఉపాధ్యాయుల కోసం ఆపస్, న్యాయవాదుల కోసం న్యాయవాద పరిషత్, జర్నలిస్టుల కోసం సమాచార భారతి, చరిత్రకారులు, ఇతిహాసికుల కోసం ఇతిహాస సంకలన సమితి, మహిళ కోసం ప్రత్యేకంగా రాష్ట్రీయ సేవికా సమితి, ముస్లీంల కోసం రాష్ట్రీయ ముస్లీం మంచ్ వంటి వేదికలు ఎన్నో కీలకంగా పని చేస్తున్నాయి. తెలంగాణలో సంస్కృత భారతి ఆధ్వర్యంలో 60 వేల మంది సంస్కృత భాషని ప్రత్యేకంగా నేర్చుకుంటున్నారంటే నమ్మగలరా!?
ఇవేగాక సేవా, సాంస్కృతిక, సంస్కార, విద్యా, ఆరోగ్య భారతి వంటి 547 సంస్థలు చాప కింద నీరులా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆ కార్యక్రమాల పరిధిలోకి వచ్చిన వాళ్ళంతా బిజెపికి కార్యకర్తలుగా దాదాపు మారుతున్నారనేది రాజకీయ పరిశీలకుల అంచనా. అంటే ఇవన్నీ దాదాపుగా బిజెపికి అనుబంధంగా పని చేస్తున్నాయన్నది వాస్తవం. ఇదంతా పార్టీ పేరు చెప్పుకుని జరగదు. రిజిస్ట్రేషన్లు, సభ్యత్వాలు, కార్యాలయాలు, కార్యవర్గాలు, కార్యకర్తలు కార్యకలాపాలు, పిలుపులు, ఆందోళనలు, జెండాలు, ఎజెండాలు, ప్ల కార్డులు, బ్యానర్లు వంటి ఖర్చులేవీ లేకుండానే హిందూ భావ జవ జీవాన్ని పరివ్యాప్తం చేస్తున్నాయి. వందల, వేల, లక్షలాది మంది వాటిల్లో స్వచ్ఛందంగా పని చేస్తుంటారు. రోజూ రకరకాల కార్యకలాపాల పేరుతో కలుస్తుంటారు. బీజేపీ కి అనుకూలంగా మారుతుంటారు.
తాము కాంగ్రెస్ కైనా, కమ్యూనిస్టులకైనా సరే, సహాయం చేస్తాం. మేం బేసికల్ గా జాతీయ వాదులమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మోన్నామధ్య అన్నారు. అడిగితే కానీ, తెలియదు. ఆ పార్టీలు అడగవు. ఆ పార్టీలు ఆర్ఎస్ఎస్ సహాయం ఎలాగూ తీసుకోవు. ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చిన బిజెపి మాత్రమే ఆ సంస్థ సహాయం తీసుకుంటుంది. తీసుకోవాలి అంతే!. అందుకే ఇప్పుడు బిజెపి మాత్రమే కాదు. బిజెపిని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ కు అనుబంధంగా అత్యంత కీలకంగా, క్రీయాశీలకంగా పని చేస్తున్న సంస్థలన్నీ బిజెపి విజయం కోసం పని చేస్తున్నాయి. అందుకే మణిపూర్ నుంచి ఢిల్లీ దాకా ఎన్నిక ఏదొచ్చినా, అక్కడ బిజెపియే గెలుస్తున్నది. పైగా ఇప్పుడు ప్రజల్లోనూ కాంగ్రెస్ వంటి జాతీయ, బిఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలతో విసుగు వచ్చేసింది. ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే తరుణంలో ఆర్ఎస్ఎస్ విస్తృతంగా ప్రచారం చేస్తున్న జాతీయ వాదం, హిందూత్వం వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే పరోక్షంగా బిజెపి వైపే అన్న మాట! అందుకే బిజెపి ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంలో ఉంది. ఎడారిలో నీటిని పుట్టిస్తామని. ఏమీ లేని చోట పంటలు పండిస్తామన్న దీమాతో ఉంది. నేరుగా గెలవడం, సాధ్యం కాకపోతే గెలిచిన వాళ్ళని కలుపుకోవడం అదీ కాకపోతే, పార్టీలనే విలీనం చేసుకోవడం ఎలాగైనా సరే అధికారమే పరమావధిగా పని చేయడమే పనిగా పెట్టకుంది. తెలంగాణలో కమల వికాసానికి బిజెపి చేస్తున్నదిదే. పెట్టని కోటలా సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టిన బిజెపికి, చాపకింద నీరులా దాని అనుంబంధ సంస్థలు పని చేస్తున్నాయి. ఏ సంస్థా నేరుగా బిజెపి కోసం పని చేసినట్లుగా కనిపించదు. కానీ, ఆ భావజాలాన్ని, హిందూ జీవ జవాన్ని ఓటర్లలో బలంగా నింపుతున్నాయి.
============

