బడ్జెట్ నిరసన కార్యక్రమానికి దూరంగా మంత్రి కొండా సురేఖ
వరంగల్ తూర్పులో వర్గపోరు మరోసారి స్పష్టమైంది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తుండగా, వరంగల్ పోచమ్మ మైదాన్ కూడలిలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. అయితే, నియోజకవర్గంలో ఈ నిరసన కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నాడు టీఆర్ఎస్‌లో నన్నపనేని నరేందర్ తో విభేదాలు, నేడు కాంగ్రెస్‌లో బసవరాజుతో సంక్షోభం పార్టీ మారినా కొండా దంపతుల తీరు మారలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తూర్పులో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు యాదేచ్ఛగా సాగుతుండటంతో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య పార్టీ పిలుపు మేరకు ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటుండగా, కొండా దంపతుల మౌనం, అలక పార్టీకి నష్టం చేస్తోందని భావిస్తున్నారు. కార్యకర్తలు, అభిమానులు అంతర్మదనంలో ఉండగా, పార్టీ ఆదేశాలను పట్టించుకోకుండా కొండా దంపతులు తమ స్వంత రాజకీయ ప్రాధాన్యతను ముందుకు తెచ్చుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.

