ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. గుజరాత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా జైమిన్ షాతో ఆయన వివాహం జరగనుంది. ఈ సందర్భంగా జీత్ ఇటీవల షార్క్ ట్యాంక్ ఇండియా షోలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. షో జడ్జి, షాదీ.కామ్ సీఈఓ అనుపమ్ మిత్తల్‌తో సరదాగా మాట్లాడుతూ, తన పెళ్లి జరగనున్నందున షాదీ.కామ్‌లో ఉన్న తన ప్రొఫైల్ తొలగించాలని కోరారు. “8వ తరగతి చదువుతున్నప్పుడు నా స్నేహితుల్లో ఎవరో ఒకరు ప్రాంక్‌గా నా వివాహ ప్రొఫైల్ క్రియేట్ చేశారు. అయితే దాన్ని తొలగించడానికి నేను చాలా ప్రయత్నించాను. ఇప్పటికైనా అది తొలగిస్తే బాగుంటుంది” అంటూ సరదాగా చెప్పారు. ఇదిలా ఉంటే, గౌతమ్ అదానీ తన చిన్న కుమారుడి పెళ్లి సంప్రదాయబద్ధంగా, నిరాడంబరంగా జరగనుందని వెల్లడించారు. జీత్ అదానీ యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్‌లో పట్టా పొందారు. 2019లో అదానీ గ్రూప్‌లో చేరిన ఆయన, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, క్యాపిటల్ మార్కెట్స్, అదానీ ఎయిర్పోర్ట్స్ వ్యాపారం, అదానీ డిజిటల్ ల్యాబ్స్ వంటి విభాగాలకు నాయకత్వం వహిస్తున్నారు.

