— వరంగల్ లో ‘ షాడో ‘ నీడలు!
— కొండా అనుచరుల గుసగుసలు!!
— కాంగ్రెస్ పాత లీడర్ల పరేషాన్లు!!!
— వివాదాస్పదమైన వాడవాడలా ఫ్లెక్సీ లు
— చోటా లీడర్ పుట్టినరోజు వేడుక బడా హంగామా?!
— చోటా వేడుకలపై ఆరా తీస్తున్న బడా బాస్

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ‘ షాడో ‘ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆ వ్యక్తి తీరుతో కాంగ్రెస్ శ్రేణులు తిప్పలు పడుతున్నాయి. మంత్రి కొండా సురేఖ ఇలాకా లో ‘ మంత్ర దండం ‘ ఎవరి చేతిలో ఉందో?! తెలియట్లేదని పార్టీ సీనియర్లు పరేషాన్ అవుతున్నారు. జనవరి 1వ తేదీ, బుధవారం సదరు వ్యక్తి పుట్టినరోజు వేడుకలను వరంగల్ లో నిర్వహించడం.. భారీ కాన్వాయ్ తో భద్రకాళి దేవస్థానానికి వెళ్లి పూజలు నిర్వహించడం వివాదాస్పదమైంది. వరంగల్ నగరంలోని పలు కూడళ్లలో హోర్డింగులు, వాడవాడలా గల్లి గల్లి లో ఫ్లెక్సీల ఏర్పాటు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఫ్లెక్సీలలో మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీధర్ రావు ఫోటోలు స్టాంప్ సైజు లో ఉండడం కొండా అభిమానులను ఆవేదన గురిచేసిందిట! ఇన్నాళ్లు బాస్ పేరు చెప్పుకొని చోటా నాయకుడిగా చలామణి అవుతున్న ఆ వ్యక్తి తూర్పు ఎమ్మెల్యే తనే?! అన్న తరహాలో పుట్టినరోజు వేడుకలలో చేసిన హంగామా కాంగ్రెస్ నాయకుల విమర్శలకు తావిచ్చింది. సదరు చోటా లీడర్ కు, ఆయన అభిమానులు గజమాలతో సన్మానం చేయడం జనాన్ని ఆశ్చర్యానికి గురిచేసిందిట!. ఇక సదరు బుడ్డ లీడర్ గతంలో టిఆర్ఎస్ నాయకులతో అంట కాగి అప్పటి తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తో జత కలిశాడని, నాడు టిఆర్ఎస్ పెద్ద పెద్ద లీడర్లు తనకు దగ్గర అంటూ గొప్పలు చెప్పుకునేవాడని కాంగ్రెస్ లీడర్లు చెవులు కొరుక్కుంటున్నారు. ఎంతో మంది కాంగ్రెస్ కోసం కష్టపడ్డ తమ లాంటి వారిని తొక్కేసి, తను కొండా దంపతులకు ప్రధాన అనుచరుడుగా ప్రమోట్ చేసుకొని, పాత క్యాడర్ను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బాహాటంగా వాపోతున్నారుట. అలాంటి వ్యక్తి పుట్టిన రోజుకి ఇంత హంగామా అవసరమా?! అని ఓరుగల్లు తూర్పు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కొత్త సంవత్సరం ఆ బుడ్డ లీడర్ ఫ్లెక్సీల జాతరతో.. ఇదేమి గోలరా బాబూ! అంటూ కాంగ్రెస్ పార్టీ పాత లీడర్లు మథన పడుతున్నారుట. ఏదైనా అవకాశం వస్తే అణిగిమణిగి ఉండాలి కానీ, ఈ హంగామా అవసరమా?! అనుకుంటున్నారు. నూతన సంవత్సరం చక్కగా సంతోషంగా గడపాల్సిన వేళ ఈ గందరగోళం గడబిడ ఏంటిరా? బాబూ! అంటూ ప్రజలు గుసగుసలాడుతున్నారు. మరోవైపు గత మూడు రోజులుగా దాదాపు రూ.30 లక్షల ఖర్చుతో జరుగుతున్న ఈ తతంగం పై కొండా దంపతులు అరా తీస్తున్నారట!


