టాలీవుడ్‌లో మరో అందమైన గ్రామీణ ప్రేమకథగా తెరకెక్కుతున్న చిత్రం ‘సింగిల్ రాజు’. విశ్వస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో ఎస్.ఎస్. వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ‘మా ఈవెంట్స్’ సహకారంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకుడు, నిర్మాత వేణు ఉడుగుల చిత్ర గ్లింప్స్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కథ ఎంతో ఆసక్తికరంగా ఉందని, చిత్ర యూనిట్ పడుతున్న కష్టానికి సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. వేణు ఉడుగుల సపోర్ట్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రేక్షకులందరినీ అలరించే పక్కా యూత్‌ఫుల్ విలేజ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం నిలుస్తుందని దర్శకుడు వర్మ ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ లవ్ స్టోరీ టైటిల్ లోగోలో బ్రోకెన్ హార్ట్’ ఎమోజీని ఉంచడం యువతలో మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.
ఈ చిత్రానికి ప్రముఖ కవులు గోరటి వెంకన్న, మిట్టపల్లి సురేందర్ అద్భుతమైన పాటలు అందించగా.. సాయితేజ కుందారపు, నితీష్ ఛాయాగ్రహణం, యునిక్ బొజ్జపల్లి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. అలాగే ప్రొడక్షన్ డిజైనర్‌గా రాజ్ మామిడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాఘవేందర్ వర్మ, సీఈఓగా శివ వర్మ సుంకరి, క్రియేటివ్ పబ్లిసిటీగా గణేష్ రత్నం వ్యవహరిస్తున్నారు. పీఆర్‌వో & డిజిటల్ బాధ్యతలను మమత రెడ్డి కాసం, అశోక్ దయ్యాల చూసుకుంటున్నారు. త్వరలోనే చిత్రబృందం పూర్తి నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటించనుంది.

