నల్గొండ జిల్లా, జానారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కూకటికారి రమేష్ (47) తన కుటుంబ పోషణ కోసం మూడు సంవత్సరాల క్రితం బెహరాన్ దేశానికి వెళ్లి ఉపాధి పొందుతున్నాడు. అయితే ఈనెల 20న బెహరాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రమేష్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు మృతి చెందగా, రమేష్ మరియు మరొకరు అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
రమేష్ మృతివార్త గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అతని భార్య చంద్రిక హార్ట్ పేషెంట్ కావడంతో, కుటుంబ సభ్యులు మొదట ఈ విషయాన్ని ఆమెకు తెలియనీయకుండా జాగ్రత్తపడ్డారు. చివరికి ఆమెకు ఈ విషయం చెప్పడంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
రమేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి తెలంగాణ గల్ఫ్ అసోసియేషన్, గల్ఫ్ సంక్షేమ సమితి సభ్యులు, తిమ్మాపూర్ గ్రామ పెద్దలు కలిసి కార్యదర్శులు మట్టేటి కొమురయ్య, జాడి గంగాధర్ సహకరించారు. రాష్ట్ర ఎన్నారై విభాగం ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు సమన్వయంతో, బెహరాన్ దేశంలోని అధికారులను సంప్రదించి, మృతదేహాన్ని శుక్రవారం స్వగ్రామానికి తరలించారు.
మృతదేహం గ్రామానికి చేరుకున్నప్పుడు కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు గ్రామాన్ని కదిలించాయి. గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రమేష్‌కు భార్య చంద్రికతో పాటు కుమార్తె కావ్య, కుమారుడు కౌశిక్ ఉన్నారు.
గ్రామ పెద్దలు, నేతలు, ప్రజలు రమేష్ అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబానికి సానుభూతి తెలిపారు. గ్రామ పెద్దలు ఈ ఘటనను దురదృష్టకరమని, ఇలాంటి విషాద సంఘటన తమ గ్రామంలో ఇదే మొదటిసారని పేర్కొన్నారు.

