రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు ఉందా?
కాషాయంలో అంతర్గత కలహాలు!
కావాల్సిన కసరత్తేది? కార్యాచరణేది?
పార్టీకి సత్తువెక్కడ? సమన్వయం ఎక్కడ?
సీనియర్లకు, కార్యకర్తలకు గుర్తింపేది?
సమీక్షలున్నాయా? సవరింపులున్నాయా?
పెరుగుతున్న పార్టీకి… పెరగని గ్రామీణ బలం!
కేంద్ర పదవులు… రాష్ట్రానికి ఉపయోగమేనా?
బూత్ కమిటీలు ఉన్నాయా? పనిచేస్తున్నాయా?
కొత్త సంస్థాగత మార్పులు… ఉత్త ఆశలేనా?
అసలు తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తుందా? కమల వికాలం కలేనా? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్రంలో ఎందుకీ దుస్థితి? పెరుగుతున్న పార్టీకి… గ్రామీణ బలం ఎందుకు పెరగడంలేదు? కేంద్ర పదవులు… రాష్ట్ర పార్టీకి నిరుపయోగమేనా? కనీసం బూత్ కమిటీలు ఉన్నాయా? అవి పనిచేస్తున్నాయా? కొత్త సంస్థాగత మార్పులు… ఉత్త ఆశలేనా? బీజేపీ తాజా పరిస్థితిపై కాషాయంలోకి కమలదళం ప్రశ్నలకు ప్రతిరూపమే ఈ ‘అడుగు’ ప్రత్యేక కథనం.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా విస్తరించే అవకాశాలు ఉన్నప్పటికీ, ఆ అవకాశాలను క్షేత్రస్థాయిలో బలంగా మలచడంలో విఫలమవుతోందా? ముఖ్యంగా నాయకుల మధ్య సమన్వయం, సీనియర్–జూనియర్ల మధ్య దూరం, గ్రామాల్లో సమస్యల గుర్తింపు, పార్టీ కార్యక్రమాల అమలు, బూత్ స్థాయి కమిటీల పనితీరు, నియోజకవర్గ ఇన్‌చార్జీల బాధ్యతలు వంటి అంశాలపై కార్యకర్తల్లో అసహనం వ్యక్తమవుతోంది. పార్టీ వ్యతిరేకుల్లోనే కాకుండా, చాలాకాలంగా పార్టీతో పనిచేస్తున్న కార్యకర్తల్లోనూ అనేక ప్రశ్నలున్నాయని కమలదళంలోనే చర్చ జరుగుతోంది.
పెరుగుతున్న పార్టీకి… పెరగని గ్రామీణ బలం!
తెలంగాణలో బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చిన రాజకీయ ప్రాతినిధ్యం, పార్లమెంట్ స్థాయిలో సాధించిన ఫలితాలు పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశాన్ని విశదం చేశాయి. అయితే, పట్టణ ప్రాంతాల్లో కనిపించే కాషాయ రాజకీయ ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో అదే స్థాయిలో కనిపించడం లేదు. గ్రామాలు, మండలాలు, బూత్‌ల స్థాయిలో నిరంతర కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణుల్లోని కొందరు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర నాయకత్వం కార్యక్రమాలు ప్రకటించడం ఒక ఎత్తైతే, వాటిని మండలం, బూత్ స్థాయిలో అమలు చేయడం మరో ఎత్తు. కార్యక్రమాలు కాగితాలపై, సమావేశాలకే పరిమితమైతే, గ్రామీణ స్థాయిలో పార్టీకి శాశ్వతమైన పునాది ఏర్పడటం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వర్గాలేనా? సఖ్యత ఎక్కడ?
రాష్ట్ర బీజేపీలో కొంతకాలంగా పలువురు ప్రముఖ రాష్ట్రస్థాయి నాయకుల మధ్య అంతర్గత వర్గాలు, గ్రూపుల తగదాలు చర్చకు వస్తున్నాయి. గతంలో రాష్ట్రంలో నాయకత్వ మార్పులు, సంస్థాగత నియామకాల సమయంలో కూడా అంతర్గత సమన్వయంపై వార్తలు వచ్చాయి. 2026 ఆగస్టులో మూడు జిల్లాల అధ్యక్షుల నియామకాలు ఆలస్యం కావడానికి నాయకుల మధ్య ఉన్న విభేదాలు కారణమని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్. రామచందర్‌రావు కొనసాగుతున్నారు. సంస్థాగత వ్యవహారాలను మరింత బలోపేతం చేసేందుకు తాజాగా జాతీయ నాయకత్వం తెలంగాణకు కొత్త బాధ్యులను కూడా కేటాయించింది. సునీల్ బన్సల్ తెలంగాణ ఇన్‌చార్జిగా కొనసాగుతుండగా, అభయ్ పాటిల్, రేఖా శర్మ కో-ఇన్‌చార్జీలుగా నియమితులయ్యారు.
అయితే, కాషాయ నాయకత్వ నిర్మాణం స్పష్టంగా ఉంటే సరిపోతుందా? కమలదళం పటిష్టంగా ఉండాల్సిన అవసరం లేదా? అన్నదే అసలు ప్రశ్నగా మిగులుతోంది.
కేంద్ర పదవులు… రాష్ట్రానికి ఉపయోగమేనా?
తెలంగాణ నుంచి కేంద్ర స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు ఉన్నారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్, ఏలేటి, రామచంద్రరావు తదితరులు రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలకంగా ఉన్నారు. అయితే ఇంతమంది ప్రముఖ నాయకులు ఉన్నప్పటికీ, జిల్లా, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయడానికి సమిష్టి కార్యాచరణేది పెద్దగా ఉండటం లేదనేది కార్యకర్తల ఆరోపణ. అయితే, ఇది వ్యక్తిగతంగా ఏదో ఒక నాయకుడిపై వస్తున్న ఆరోపణ కాదు, కానీ, పార్టీ నాయకత్వం సమిష్టిగా తీసుకోవాల్సిన బాధ్యత.
జిల్లా ఇన్‌చార్జీల కార్యాచరణేది?
రాష్ట్రం నుంచి జిల్లాలకు ఇన్‌చార్జీలను నియమించడం సంస్థాగతంగా సాధారణ ప్రక్రియ. కానీ, ఇన్‌చార్జీలు క్రమం తప్పకుండా జిల్లాలకు వెళ్లి మండల, బూత్ స్థాయి నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారా? స్థానిక సమస్యలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తున్నారా? కార్యకర్తల మధ్య వివాదాలను పరిష్కరిస్తున్నారా? జిల్లా, మండల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, బూత్ కమిటీల మధ్య సమన్వయం లేకపోతే రాష్ట్ర నాయకత్వం ప్రకటించే కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లడం కష్టమవుతుంది.
సీనియర్లకు స్థానం లేదా?
బీజేపీలో ఏళ్ళుగా పనిచేసిన సీనియర్ నాయకులు, కష్టకాలంలో పార్టీ జెండాను మోసిన కార్యకర్తల పాత్రను విస్మరించకూడదనే డిమాండ్ కొందరి నుంచి వినిపిస్తోంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అవకాశాలు ఇవ్వడం రాజకీయ విస్తరణలో భాగమే అయినప్పటికీ, పాత కార్యకర్తల అనుభవాన్ని కూడా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ఉంది.“సీనియర్ నాయకులతో పార్టీకి పనిలేదా?” అనే ప్రశ్నకు పార్టీ నాయకత్వమే సమాధానం చెప్పాలని కొందరు కార్యకర్తలు అంటున్నారు.
ఎన్నికల ఇన్‌చార్జీలు.. నిధుల చుట్టే రాజకీయాలా?
నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను నియమించిన తర్వాత పార్టీ నిధుల నిర్వహణలో పారదర్శకత ఉందా? అభ్యర్థులు, ఇన్‌చార్జీలు, స్థానిక నాయకుల మధ్య నిధుల వినియోగంపై స్పష్టత ఉందా? అనే ప్రశ్నలు కొందరు కార్యకర్తలు లేవనెత్తుతున్నారు.
అయితే, నిధుల దుర్వినియోగం, వ్యక్తిగతంగా డబ్బు తీసుకోవడం లేదా ఇతర పార్టీలకు కమిషన్లు ఇవ్వడం వంటి ఆరోపణలకు నిర్దిష్ట ఆధారాలు లేకుండా పేర్కొనడం సరికాదు. అలాంటి ఆరోపణలు ఉంటే పార్టీ అంతర్గత ఆడిట్, ఎన్నికల ఖర్చుల రికార్డులు, ఆధారాలతో పరిశీలించాల్సిన అవసరం ఉంది.
బూత్ కమిటీలు ఉన్నాయా? పనిచేస్తున్నాయా?
ఏ పార్టీకైనా అసలు బలం బూత్ స్థాయి కార్యకర్తలే. బూత్ కమిటీలు కాగితాలపై మాత్రమే ఉండి, ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకు వస్తే పార్టీకి శాశ్వతమైన ఓటు బ్యాంకు నిర్మించడం కష్టం. ప్రతి బూత్‌లో ఓటర్లతో సంబంధాలు, స్థానిక సమస్యలపై స్పందన, కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం, యువత–మహిళలతో అనుసంధానం వంటి కార్యక్రమాలు నిరంతరం సాగాల్సి ఉంటుంది.
అభ్యర్థుల ఎంపికల్లో అవకతవకలు
గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు అభ్యర్థులు కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చే స్థాయిలో కూడా ఓట్లు సాధించలేకపోయారని కార్యకర్తల్లో చర్చ ఉంది. అయితే ప్రతి అభ్యర్థి పనితీరును కేవలం ఓట్ల సంఖ్యతోనే అంచనా వేయలేం. నియోజకవర్గ పరిస్థితులు, పార్టీ బలం, ప్రత్యర్థుల సామాజిక–రాజకీయ సమీకరణాలు, అభ్యర్థి పరిచయం వంటి అనేక అంశాలు ఫలితాలను ప్రభావితం చేస్తాయి. అయితే, కింది స్థాయి కార్యకర్తల మనోభావాలకు విరుద్ధంగా అభ్యర్థులను పై నుంచి రుద్దే ప్రక్రియపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయినా, ఎన్నికల తర్వాత పనితీరుపై సమీక్ష నిర్వహించడం పార్టీకి ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరు ఎన్ని ఓట్లు సాధించారు? ఎన్ని బూత్‌లలో పార్టీ ఆధిక్యం సాధించింది? ఎక్కడ ఏజెంట్లు పనిచేశారు? ఎక్కడ సంస్థ బలహీనంగా ఉంది? వంటి అంశాలపై వాస్తవ డేటాతో సమీక్ష జరిగితే భవిష్యత్ వ్యూహానికి ఉపయోగపడుతుంది.
కార్యకర్తలకు గుర్తింపు ఎప్పుడు?
క్రమశిక్షణతో ఏళ్ళుగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు పదవులు, బాధ్యతలు, రాజకీయ అవకాశాల్లో తగిన గుర్తింపు దక్కడం లేదనే అసంతృప్తిని నాయకత్వం పరిశీలించాల్సిన అవసరం ఉంది. పదవుల కోసం మాత్రమే కాకుండా, పార్టీని నిర్మించిన కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీకి స్థానికంగా బలం పెంచే అవకాశం ఉంటుంది.
కొత్త సంస్థాగత మార్పులు… ఉత్త ఆశలేనా?
తాజాగా తెలంగాణ బీజేపీలో ఐదుగురు కీలక నేతలతో రాజకీయ, సంస్థాగత బాధ్యతలను పునర్వ్యవస్థీకరించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. రాజకీయ వ్యవహారాల్లో సునీల్ బన్సల్, అభయ్ పాటిల్, రేఖా శర్మ రాష్ట్ర పార్టీని పర్యవేక్షించనున్నారు. అయితే గత పరిశీలకుల పనితీరును పరిశీలిస్తే, వీళ్ళే మేరకు పని చేస్తారనేది ప్రశ్నార్థకంగానే ఉంది.
బీజేపీకి భవిష్యత్తు ఉందా?
అసలు తెలంగాణలో బీజేపీకి విస్తరించే రాజకీయావకాశాలు ఉన్నాయా? అన్నదానికంటే, ఆ అవకాశాన్ని పార్టీ బలంగా మార్చే సామర్థ్యం ఎంత మేరకు ప్రదర్శిస్తుందన్నదే కీలకం.
గ్రూపుల సమన్వయం. సీనియర్ల అనుభవాన్ని ఉపయోగించుకోవడం, జూనియర్లకు అవకాశాలివ్వడం, పాత కార్యకర్తలను కాపాడుకోవడం ఇక్కడ కీలకం. అలాగే, ఇన్‌చార్జీల పనితీరును సమీక్షించడం, పార్టీ నిధుల వినియోగంలో పారదర్శకత, ప్రతి బూత్‌లో కార్యకర్తలను నియమించడం, వంటి కార్యక్రమాలతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తారా? అన్నవే ప్రదాన సమస్యలు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలోనూ ఉంది అని కాకుండా, పనిచేస్తోందనే సందేశాన్ని అటు కార్యకర్తలకు ఇవ్వడంద్వారా ప్రజలు చర్చించుకునే స్థాయికి తీసుకెళ్లడం అసలు సవాల్. తెలంగాణ బీజేపీ నాయకత్వం ఈ సవాల్ ను స్వీకరించడానికి సిద్ధంగా ఉందా?

