చైనా కబుకీ ఎడారిలో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ గ్రేట్‌వాల్ నిర్మాణం చేపట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. 400 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పుతో ఈ ప్రాజెక్టు 100 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతానికి 5.4 గిగావాట్ల సోలార్ ప్యానెల్స్‌ను ఇప్పటికే అమర్చగా, ఈ ప్రాజెక్టు ద్వారా బీజింగ్ విద్యుత్తు అవసరాలను తీర్చనున్నారు. కబుకీ ఎడారి అధిక వేడి, శూన్యమైన భూమి, పారిశ్రామిక ప్రాంతాలకు సమీపం వంటి అంశాలతో సోలార్ పవర్ నిర్మాణానికి అనువుగా మారింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా జున్మా సోలార్ పవర్ స్టేషన్ గుర్రం ఆకారంలో రూపొందించబడింది. ఇది ఏటా 200 కోట్ల కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయగలదు, 4 లక్షల మందికి విద్యుత్తు అందించగలదు. నాసా ఉపగ్రహాలైన ల్యాండ్ శాట్ 8, 9 ఈ ప్రాంత మార్పులను చిత్రీకరించాయి. 2017 నుంచి 2024 మధ్యకాలంలో కబుకీ ఎడారి రూపురేఖల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.
ప్రపంచ సోలార్ విద్యుత్తులో చైనా 3,86,875 మెగావాట్ల సామర్థ్యంతో ముందంజలో ఉంది. అమెరికా 79,364 మెగావాట్లతో పక్కన పడిపోతుండగా, చైనా గ్లోబల్ సోలార్ మార్కెట్‌లో దాదాపు సగం వాటా దక్కించుకుంది.

