సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని చెప్పారు. ముఖ్యంగా సన్నబియ్యం పథకం తెలంగాణ ప్రజల జీవితాల్లో కీలక మలుపు అని, ఇది ఒక అద్భుతమైన ప్రజాపథకంగా నిలుస్తుందన్నారు. గతంలో రూ.2కి కిలో బియ్యం ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు అందిస్తున్న సన్నబియ్యం పథకం శాశ్వత గుర్తింపును సంపాదించిందన్నారు. భూభారతి పథకాన్ని రైతులకు అందించాలన్నా, ఇందిరమ్మ ఇండ్లను నిజమైన లబ్దిదారులకు క్షేత్రస్థాయిలో అందించాలన్నా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
కులగణన ద్వారా వందేళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం ఇచ్చామని, విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేలా బిల్లులు తీసుకొచ్చామని వెల్లడించారు. ఇది తమ పారదర్శక పాలనకు నిదర్శనమని అన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ చేసిన గొప్ప పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత అందరిపైనా ఉందని, రేపటి నుంచే జూన్ 2 వరకు ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ప్రతీ గ్రామాన్ని సందర్శించాలని ఆదేశించారు. తాను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవుతానని తెలిపారు.
హెచ్‌సీయూ భూములపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ప్రధాని మోదీ కూడా వాటిని నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు విష ప్రచారం చేస్తున్నాయన్నారు. తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుండటంతోనే కాంగ్రెస్‌ను బీజేపీ, బీఆర్ఎస్ టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. “సన్నబియ్యం మన పథకం, మన పేటెంట్, మన బ్రాండ్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో వారు చెప్పాలి,” అంటూ రేవంత్ విమర్శించారు.

