వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత తీవ్రమవుతుంది. ఇప్పుడే మేల్కొంటేనే రబీ రైతు ఆశలను, ప్రజల ఆహార భద్రతను కాపాడగలం.!
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
వానాకాలం ముగింపు దశకు చేరుతున్నా వరుణుడు కరుణించడంలేదు. వానలు ముఖం చాటేయడం రైతాంగాన్ని కలవరపెడుతోంది. అక్కడక్కడా చెదురుమదురు జల్లులు తప్ప ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఖరీఫ్ సాగు ఇప్పటికే ఒడిదుడుకులకు గురైంది. ఇక సెప్టెంబర్‌లోనూ వర్షాలు తగ్గుముఖం పడితే రబీ సాగుపై దాని ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. భారత వాతావరణ శాఖ అంచనాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రాష్ట్రాలు ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
వర్షాభావం అంటే కేవలం ప్రస్తుత పంటలకు నష్టం కాదు. నేలలో తేమ తగ్గడం, చెరువులు నిండకపోవడం, రిజర్వాయర్లలోకి నీరు చేరకపోవడం, భూగర్భ జలాలు అడుగంటడం వంటి పరిణామాలు వరుసగా చోటుచేసుకుంటాయి. అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే రబీ సీజన్‌కు ఇది పెద్ద ప్రతికూలత. గోధుమ, శనగ, ఆవాలు వంటి పంటలకు విత్తనాలు మొలకెత్తేందుకు నేలలో తగిన తేమ అవసరం. మొదటి తడికే నీరు అందకపోతే రైతు పెట్టుబడి పెట్టడానికి కూడా వెనుకాడాల్సిన పరిస్థితి వస్తుంది.
తెలంగాణలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. రాష్ట్రంలో సాధారణంగా 1.32 కోట్ల ఎకరాల్లో సాగు నమోదవుతుండగా, ఈసారి 1.21 కోట్ల ఎకరాల్లోనే సాగు జరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. అంటే సాధారణ సాగు విస్తీర్ణంలో 92 శాతానికే పరిమితమైంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 66 లక్షల ఎకరాలు కాగా, ఈసారి 52.81 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. అంటే 20 శాతం తగ్గుదల. మరోవైపు పత్తి 47 లక్షల ఎకరాల అంచనాకు మించి 48 లక్షల ఎకరాల్లో సాగవడం, అపరాలు 6.49 లక్షల ఎకరాల నుంచి 7.86 లక్షల ఎకరాలకు పెరగడం రైతులు నీటి కొరతకు అనుగుణంగా పంటల ఎంపికలో కొంత మార్పులు చేస్తున్నారనే సంకేతం.
రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 598.9 మిల్లీ మీటర్లు కాగా, 478.2 మిల్లీమీటర్లే నమోదవడం, 20 శాతం లోటు ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనా, 18 జిల్లాల్లో లోటు కొనసాగుతోంది. జనగామ, వరంగల్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో 40 శాతం వరకు లోటు నమోదవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
వర్షాల కొరతకు తోడు భూగర్భ జలాల పరిస్థితి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. గతేడాది ఆగస్టు చివరినాటికి 5.78 మీటర్ల లోతులో ఉన్న నీటిమట్టం ఈసారి 7.87 మీటర్లకు పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే సగటున రెండు మీటర్లకు పైగా నీటిమట్టం దిగజారింది. సూర్యాపేట, వికారాబాద్‌లో ఐదు మీటర్ల మేర, నారాయణపేట, మహబూబ్‌నగర్, మేడ్చల్‌లో నాలుగు మీటర్ల వరకు, వరంగల్, సంగారెడ్డి, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మూడు మీటర్ల వరకు నీటిమట్టం తగ్గడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
రైతులు పంటలను కాపాడుకునేందుకు చెరువుల్లో మిగిలిన కొద్దిపాటి నీటిని మోటార్లతో తోడుతున్నారు. కొత్త బోర్లు వేస్తున్నారు. అయినా చుక్క నీరు పడకపోతే పెట్టుబడులన్నీ బూడిదలో పోసిన పన్నీరే. వరుణుడు మరో వారం, పది రోజులు కరుణించకపోతే ఇప్పటికే వేసిన పంటల భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారుతుంది.
ఇది కేవలం రైతు సమస్యగా చూడటం పొరపాటు. పంట దిగుబడులు తగ్గితే ఆహార ధాన్యాల సరఫరాపై ప్రభావం పడుతుంది. పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల ఉత్పత్తి తగ్గితే ధరలు పెరిగి సామాన్యుడి వంటింటిపై భారం పడుతుంది. అంటే పొలంలో మొదలైన వర్షాభావం చివరకు పట్టణాల్లోని కుటుంబ బడ్జెట్‌ను తాకుతుంది.
అందుకే ప్రభుత్వం వర్షాల కోసం ఎదురుచూస్తూ కాలం గడపకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టాలి. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలోని నీటిని శాస్త్రీయంగా వినియోగించాలి. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలి. పంట నష్టాన్ని అంచనా వేసి బీమా, పరిహారం, ప్రత్యామ్నాయ విత్తనాలపై ముందస్తు చర్యలు తీసుకోవాలి. భూగర్భ జలాల రీఛార్జ్‌కు ప్రత్యేక ప్రణాళిక అవసరం.
వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత తీవ్రమవుతుంది. ఇప్పుడే మేల్కొంటేనే రబీ రైతు ఆశలను, ప్రజల ఆహార భద్రతను కాపాడగలం.

