తొర్రూరు ట్యాంక్ బండ్, చెన్నూరు-పాలకుర్తి రిజర్వాయర్ల పనులు వేగవంతం చేయాలి
నీటిపారుదల శాఖ సమీక్షలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పాలకుర్తి నియోజకవర్గంలో ఎండాకాలంలో త్రాగునీటి కొరత లేకుండా చూడాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్, మున్సిపల్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో సిఈ తో కలిసి ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యంగా ఎండాకాలంలో ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.
తొర్రూరు ట్యాంక్ బండ్ పనులపై ఇప్పటి నుంచే నీటి నిల్వలను కాపాడుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలని, అవసరమైన ప్రాంతాలకు నీటి సరఫరా నిరవధికంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల నీటి నిల్వల వివరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. వచ్చే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి చుక్కనీటిని ఉపయోగకరంగా మార్చేలా చూడాలన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ … ఎండాకాలంలో ప్రజలకు త్రాగునీటి తాకిడి లేకుండా ఉండేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితో త్రాగునీటి సమస్యను అధిగమిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కాలువల పూడికతీత సమస్య ప్రధానంగా ఉందని, పలు ప్రాంతాల్లో కాలువల్లో భారీగా పూడిక పేరుకుపోవడంతో నీటి ప్రవాహం సక్రమంగా జరగడం లేదని, దీంతో సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. పైరుల సాగు నిలిచిపోకుండా ఉండేందుకు కాలువల పూడికతీత పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా చిన్నకాల్వల విషయంలో స్థానిక అధికారులతో కలిసి పంచాయతీలు, గ్రామస్థాయి సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని కి వారి శాఖల వారీగా అధికారులు త్రాగునీటి ప్రాజెక్టుల అమలు, నీటి నిల్వల వినియోగ ప్రణాళిక, కాలువల పూడిక తొలగింపు తదితర అంశాలపై అధికారులు పూర్తిస్థాయిలో నివేదిక ద్వారా వివరించారు. మున్సిపల్ అధికారులు పట్టణ ప్రాంతాల్లో నీటి సరఫరాపై తీసుకుంటున్న చర్యలను ఎమ్మెల్యే ఆరా తీశారు.

