గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు… అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు… కరెంటుతో గీజరేసినట్లు… యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి పొగలు గక్కుతది.!! సలికాలంల కూడ ఆవిరి పొగలు కమ్ముకుంటయి.!!! గీ యింత ఏందో? ఎక్కడ్నో అనుకునేరు? మన పక్కనే? కావాల్నంటే సూద్దాం పదండ్రి.

తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్ల మణుగూరు మండలం పగిడేరు, గొల్లకొత్తూరుల మూడు సోట్ల బోరుల్ల, బావుల్ల యేడి నీరు ఉబికి వత్తనే ఉంది. వాన పడినా, సలికాలం ఒచ్చినా, నీటి ఆవిరి పొగలు కమ్ముకుంటయి. ఇగ గా ఊర్లోల్లు గా నీల్లను పట్టుకుని తానాలకు, బట్టలకు వాడుతాండ్రు. ఏడాదికేడాదంతా గిట్లనే ఉంటది. మరి, గిండ్ల యింతేందని ఆరా తీత్తే… గా ఊర్లోల్లు ఏం చెప్పతాండ్రంటే.. ‘గీడ భూమిల బొగ్గు గనులున్నయి. గయి యేడిగ ఉంటయి. గందుకనే గాడ భూమిల నీల్లు యేడిగ ఉంటానయి. భూమి పైన కూడ యేడిగ ఉండుట్ల గా పొగలు కమ్ముతానయి.’ అంటాండ్రు.!?

