తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పూర్తిగా ఎఐసిసి పరిధిలోనే ఉంటుందని, దీనికి సంబంధించిన తుది నిర్ణయం పార్టీ నాయకత్వమే తీసుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం మొత్తం మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉన్నాయని, అయితే విస్తరణలో కొన్ని అడ్డంకులు ఉన్నాయని చెప్పారు. అవి తొలగిపోయిన వెంటనే మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. విస్తరణలో ప్రాంతీయ సమతుల్యత, కులపరమైన సమానత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా విస్తరణ జరుగుతుందని పేర్కొంటూ, ముఖ్యంగా మైనార్టీలకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్‌గా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ, ఈ విస్తరణలో ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించాలని కోరినట్లు వెల్లడించారు. త్వరలోనే ఎఐసిసి దీనిపై నిర్ణయం తీసుకుని మంత్రివర్గ విస్తరణ పూర్తి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

