దేశవ్యాప్తంగా FIVE YEARS|ఐదు సంవత్సరాలు దాటి కూడా AADHAR|ఆధార్ అప్‌డేషన్ చేయించుకోని చిన్నారుల సంఖ్య 7 కోట్లమందికి పైగా ఉందని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) వెల్లడించింది. ఈ నేపథ్యంలో చిన్నారుల బయోమెట్రిక్ అప్‌డేట్‌ను సులభతరం చేయడానికి ఉడాయ్ ఒక ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించింది. ఈ ప్రాజెక్టు కింద పాఠశాలల నుంచే దశలవారీగా బయోమెట్రిక్ అప్‌డేట్ ప్రక్రియను అమలు చేయనున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాకు బయోమెట్రిక్ యంత్రాలను పంపిణీ చేసి, అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఆధార్ కస్టోడియన్ ఉన్నతాధికారి ఈ విషయాన్ని వెల్లడించారు.
ఉడాయ్ సీఈవో భువనేశ్ కుమార్ మాట్లాడుతూ, పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్‌ను తల్లిదండ్రుల సమ్మతితో పాఠశాలల ద్వారా చేపట్టేందుకు సాంకేతికంగా సిద్ధంగా ఉండేలా ప్రణాళికను రూపొందించామని చెప్పారు. ప్రస్తుతానికి అవసరమైన సాంకేతికతను పరీక్షిస్తున్నామని, మరో 45 నుంచి 60 రోజుల్లో ఈ ప్రాజెక్టు అమలుకు సిద్ధమవుతుందని తెలిపారు. 5 నుంచి 7 ఏళ్ల వయసు పిల్లల వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి ఇది ఉపయోగపడనుందని పేర్కొన్నారు. ఏడేళ్లు దాటిన తర్వాత అప్‌డేట్ చేయాలంటే రూ.100 రుసుము విధించనున్నట్లు తెలిపారు.
ఇంతేకాదు, 15 ఏళ్లు పూర్తయిన తర్వాత జరగాల్సిన రెండో తప్పనిసరి BIO METRIC|బయోమెట్రిక్ అప్‌డేట్ (MBU) కోసం కూడా ఇదే విధానాన్ని స్కూళ్లు మరియు కాలేజీల ద్వారా అమలు చేయాలని ఉడాయ్ భావిస్తోంది. ఆధార్ అనేక ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్నందున, పిల్లలు ఈ పథకాల ప్రయోజనాలను సమయానికి పొందాలంటే వారి బయోమెట్రిక్ వివరాలు నవీకరించబడినవే ఉండాలని ఆయన తెలిపారు. స్కూల్ అడ్మిషన్లు, స్కాలర్‌షిప్లు, డీబీటీ నగదు బదిలీ పథకాలు వంటి ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ డేటా సరిగ్గా ఉండటం అవసరం.
ఎంబీయూ (MBU) ను నిర్లక్ష్యం చేస్తే ఆధార్ డేటాలో పొరపాట్లు రావచ్చు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, 7 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత కూడా ఎంబీయూ పూర్తికాకపోతే, సంబంధిత ఆధార్ డీయాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉందని ఉడాయ్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పిల్లల భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో స్కూళ్ల స్థాయిలోనే బయోమెట్రిక్ అప్‌డేట్‌ను అమలు చేయనున్నట్లు భువనేశ్ కుమార్ స్పష్టంచేశారు.

