పాలకుర్తిలో ఎర్రబెల్లి పర్యటన
జనగామ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం పలు గ్రామాల్లో పర్యటిస్తూ రైతులు, బాధిత కుటుంబాలను పరామర్శించారు. పాలకుర్తి మండలం తొర్రూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన ఆయన, 40 రోజులుగా కల్లాల్లోనే ఉన్న ధాన్యం కొనుగోలు కాక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. లారీలు, గన్నీ బ్యాగుల కొరతతో కొనుగోళ్లు నిలిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేయగా, వెంటనే జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడి సమస్యను వివరించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి నష్టపోకుండా చూడాలని కోరారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని, ముందస్తు ప్రణాళిక లోపంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
అనంతరం పెద్దతండాలో మాజీ సర్పంచ్ జరుపుల బాలు నాయక్ తండ్రి మంగ్యా నాయక్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గూడూరు గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో రూ. లక్ష విలువైన గడ్డి వాము, పశువుల పాగా దగ్ధమైన రైతు తోటకూరి నర్సయ్యను పరామర్శించారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు.

