అచ్చంపేట నియోజకవర్గంలో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
సంతోషంలో గిరిజన రైతులు
రైతుల పొలాల్లో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయడంతో పాటు, సోలార్ ప్యానెల్స్‌ను కూడా స్థాపించి వారికి సాగుతోపాటు అదనపు ఆదాయం కల్పించే పథకమే ఇందిర సౌర గిరి జల వికాసం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిర సౌర గిరి జల వికాసం పథకంను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ పథకం ప్రవేశపెట్టడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యుత్ ఆధారిత పంపుసెట్ల స్థానంలో సోలార్ పంపులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను వంద రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టమైన గడువు విధించారు.
పథకం ద్వారా లబ్ధిపొందే గిరిజన రైతులకు పక్కా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని సీఎం కోరారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి రైతుకు సోలార్ పంపుసెట్లు అందించే లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. సోలార్ విద్యుత్ ద్వారా సాగుతోపాటు రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నారు. ఈ పథకం ఇతర ప్రాంతాలకు మార్గదర్శిగా నిలవాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

