గతవారం భారీ నష్టాలకు సోమవారం బ్రేకులు వేసి, లాభాల బాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడిదుడుకులను అనుభవించాయి. మార్కెట్లు లాభనష్టాలతో దోబూచులాడాయి. ఆటో, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగాలు మంచి ప్రదర్శన కనబరచినప్పటికీ, మెటల్ స్టాక్స్ నష్టాల్లో ఉండడంతో సెన్సెక్స్ ఒడిదుడుకులు ఎదుర్కొంది. మంగళవారం మార్కెట్ ప్రారంభం 150 పాయింట్ల లాభంతో అయినప్పటికీ, కొద్దిసేపటికే నష్టాలలోకి జారుకుంది. సెన్సెక్స్ 78,540 వద్ద ముగిసిన సోమవారం ముగింపుతో పోలిస్తే, మంగళవారం 78,397 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. కానీ, ఆ తర్వాత మార్కెట్ తిరిగి లాభాల్లోకి చేరుకుంది. ఒక దశలో 300 పాయింట్ల లాభాన్ని ఆర్జించి, 78,877 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. మధ్యాహ్నం తరువాత అమ్మకాలు మొదలవడంతో మార్కెట్ కాస్త ఒడిదుడుకులకు లోనైంది. చివరకు, 67 పాయింట్ల స్వల్ప నష్టంతో 78,472 వద్ద ముగిసింది.
ఇంకా, నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 15 పాయింట్ల లాభంతో ప్రారంభించిన నిఫ్టీ, 25 పాయింట్ల నష్టంతో 23,727 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో కొన్ని షేర్లు లాభాలను అందుకున్నాయి. ఆర్బీఎల్ బ్యాంక్, బయోకాన్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, హిందుస్తాన్ కాపర్, టాటా కెమికల్స్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. అలాగే, పీబీ ఫిన్‌టెక్, మాక్రోటెక్ డెవలపర్స్, సైమన్స్, దాల్మియా భారత్ షేర్లు నష్టాలను చవిచూశాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 35 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 84 పాయింట్లు నష్టపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.20గా ఉంది.

