ఒడిశాలోని నయాగడ్ జిల్లా అటవీ ప్రాంతంలో అరుదైన నల్ల చిరుతను ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నల్ల చిరుత, తన పుట్టిన చిరుతకూనను నోట కరుచుకుని అటవీ ప్రాంతంలో సంచరిస్తుండగా కెమెరాల్లో చిక్కింది. అడవిలో జంతువుల జాతులు, వాటి ఆరోగ్యం, బాగోగుల పరిశీలన కోసం అధికారులు గోప్యంగా పలు ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. అటువంటి కెమెరాల ద్వారా నల్ల చిరుత ఉన్నట్టు గుర్తించడం సంచలనంగా మారింది.
అటవీ శాఖ అధికారులు దీనిపై పరిశీలన చేపట్టి పలు విషయాలను వెలుగులోకి తెచ్చారు. సాధారణ చిరుతలు “మెలనిజం” అనే జన్యు లోపం కారణంగా నల్లగా మారతాయని, ఇది ప్రత్యేకమైన జాతి కాదని తేల్చారు. ఈ జన్యులోపం ఒడిశాలోని మూడు అటవీ డివిజన్లలోనూ ఉన్నట్లు నిర్ధారించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నల్ల చిరుతలకు పుట్టే కూనలు సాధారణ చిరుతలాగే ఉంటాయి.
ప్రస్తుతం ట్రాప్ కెమెరాలు గుర్తించిన ఈ చిరుత, తన కూనను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తుండగా కనిపించిందని అధికారులు పేర్కొన్నారు. ఈ అరుదైన దృశ్యాల వల్ల నల్ల చిరుతల జీవన విధానంపై మరింత సమాచారం సేకరించడానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

